ఉన్నమాట: BRS ప్రభావం దేశంలో ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ ఏపీలో మాత్రం ఆ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడి వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమౌతున్నది. దీనికి కారణం ఉద్యమ కాలంలో కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు లేదు. ఎందుకంటే వివిధ సందర్భాల్లో కేసీఆర్ ఏపీ వెళ్లినప్పుడు అక్కడి ప్రజల నుంచి వచ్చిన స్పందనే దానికి ఉదాహరణ.
అలాగే ఇటీవల రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నట్లు ఆంధ్రలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్న కేసీఆరే రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆంధ్ర ప్రజల కాలుకు ముల్లు గుచ్చితే తన పంటితో తీస్తాను అన్నాడు. ఆయన అలా అన్న తర్వాత కేసీఆర్‌పై ఉన్న కోపం అంతా పోయిందన్నారు. ప్రజా ప్రతినిధుల మాటలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలకు మాత్రం కేసీఆర్‌పై ఎలాంటి కోపం లేదన్నది వాస్తవం.
ఉద్యమ నాయకుడిగా భావోద్వేగంతో మాట్లాడిన మాటలు పాలకుడిగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, భద్రత తన బాధ్యత అన్నది తన ఎనిమిదేళ్ల కాలంలో చూపెట్టాడు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడలేదు. అందుకే రాష్ట్ర విభజన అనంతరం ఏం జరుగుతుందో అన్న కొంతమంది సృష్టించిన భయోందోళనలు అసత్యమని తేలింది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున తెలంగాణలో పోటీ చేసి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈక్రమంలో ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నప్పుడు మరో రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంతో వైసీపీ తెలంగాణ రాజకీయాల్లో తల దూర్చమని చెప్పింది. టీడీపీ ఇప్పటికీ తెలంగాణలో తమకు బలం ఉన్నదని చెప్పుకుంటున్నా తెలంగాణలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం బట్టి వారి బలమెంతో తేలిపోయింది.
వామపక్షాలు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తున్నందున ఆ పార్టీల జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. జనసేన అధినేత రాజకీయ నిర్ణయాలపై ఎవరో కాదు ఆపార్టీ నాయకులే స్పష్టత లేదు. రాజధాని అంశం చుట్టే తిరుగుతున్న అక్కడి రాజకీయాల కంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నది అక్కడి ప్రజల ఆకాంక్ష.
పార్లమెంటు వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసింది. కనుక అక్కడ ప్రజల ఆలోచనలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ పోటీ చేస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుంది. అందుకే వైసీపీ నేతలు బీఆర్ఎస్ గురించి కొంత బెంగతో ఉన్నారని వారి మాటలను బట్టి అర్థమౌతున్నది.