విధాత: కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులు నిర్మల సీతారామన్ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరాశపరిచేలా ఉందని నల్గొండ భువనగిరి పార్లమెంటు సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు అభిప్రాయపడ్డారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను బడ్జెట్‌లో మరోసారి పట్టించుకోలేదన్నారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తదితర హామీలను బడ్జెట్‌లో కేంద్రం విస్మరించిందన్నారు. వ్యవసాయం, నిరుద్యోగం సమస్యలపై కొత్త చర్యలు ప్రకటించలేదన్నారు.
సబ్సిడీలు తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు పెరిగి పేదలపై భారం పడే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల్లో సుమారు 15 లక్షల పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికి వాటిని భర్తీ చేసే దిశగా బడ్జెట్లో ఊసు లేదన్నారు. విద్య, వైద్య రంగానికి కేటాయింపులు పెంచకపోవడం సమంజసంగా లేదన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ ఆధునీకరణపై, బీబీనగర్ నుండి నడికుడి వరకు డబ్లింగ్ పనులపై బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం, కాజీపేట నుంచి మాచర్ల వరకు గతంలో ప్రతిపాదించిన రైల్వే లైన్ కు నిధులు కేటాయించకపోవడం, విజయవాడ-హైదరాబాద్ హైవే వెంట రైల్వే లైన్, బుల్లెట్ ట్రైన్ సర్వే ప్రస్తావన లేకపోవడం శోచనీయమనన్నారు.