Site icon vidhaatha

Bypoll Results 2023 | ‘ఇండియా’దే పైచేయి.. ఏడు సీట్లకు మూడింట విజయం

Bypoll Results 2023 | INDIA |

న్యూఢిల్లీ: ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చిన తర్వా జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆధిక్యం కనబర్చాయి. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. ఇండియా కూటమి 3 స్థానాల్లో విజయం సాధించింది. మరో మూడు స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నది. యూపీలోని ఒక స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

తాజా వార్తల ప్రకారం అందులో బీజేపీ బాగా వెనుకబడింది. ఏడు అసెంబ్లీ సీట్లకు శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో జార్ఖండ్‌లోని డుమ్రి, పశ్చిమబెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పుతుప్పళ్లి స్థానాలు ఇండియా కూటమి వశమయ్యాయి. త్రిపుర, ఉత్తరాఖండ్‌లోని రెండు సీట్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.

యూపీలోని ఘోసీ స్థానంలో కౌంటింగ్‌ ఇంకా ముగియనప్పటికీ.. సమీప బీజేపీ అభ్యర్థిపై ప్రతిపక్ష కూటమిలోని సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో ఇప్పటికే సమాజ్‌వాదీ కార్యకర్తలు విజయోత్సవాలు మొదలు పెట్టేశారు.

ఈ విజయం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపునకు సంకేతమని ఎస్పీ నేతలు వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కొనాలనుకుంటున్న ఇండియా కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి.

త్రిపురలో ధన్‌పూర్‌ సీటును సీపీఎం నుంచి బీజేపీ కైవసం చేసుకున్నది. ఘోసీ, డుమ్రిలో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. ఈ మొత్తం ఏడు సీట్లలో మూడు గతంలో బీజేపీ ప్రాతినిథ్యం వహించినవి. సమాజ్‌వాది, సీపీఎం, జేఎంఎం, కాంగ్రెస్‌ ఒక్కో స్థానంలో ప్రాతినిథ్యం వహించాయి. ఘోసీలో సమాజ్‌వాది అభ్యర్థి సుధాకర్‌సింగ్‌.. సమీప బీజేపీ అభ్యర్థి దారాసింగ్‌ చౌహాన్‌పై 35వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

ఇది ఇండియా కూటమి విజయమని సమాజ్‌వాది అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ అన్నారు. ఎన్డీయేకు వీడ్కోలు పలికేందుకు యూపీ సిద్ధంగా ఉన్నదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. డుమ్రిలో జేఎంఎం అభ్యర్థి బేబీదేవి 17వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. త్రిపురలోని బాక్సానగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి తఫాజ్జల్‌ హొసైన్‌, ధన్‌పూర్‌ నుంచి బిందు దేబ్‌నాథ్‌ గెలిచారు.

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి పార్వతిదాస్‌ 2వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమబెంగాల్‌లోని ధూప్‌గిరి స్థానాన్ని బీజేపీ నుంచి తృణమూల్‌ కైవసం చేసుకున్నది. ఇక్కడ టీఎంసీ అభ్యర్థి నిర్మల్‌ చంద్రరాయ్‌ 4వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇక కేరళలోని పుతుప్పళ్లి స్థానంలో మాజీ సీఎం ఊమెన్‌ చాందీ తనయుడు చాందీ ఊమెన్‌ తండ్రికి మించిన మెజార్టీ సాధించి గెలుపొందారు. ఊమెన్‌ చాందీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. చాందీ ఊమెన్‌కు 78,098 ఓట్లు లభించగా.. సమీప సీపీఎం ప్రత్యర్థి జేక్‌ సీ థామస్‌కు 41,644 ఓట్లు వచ్చాయి.

Exit mobile version