CM Chandrababu: పవిత్రమైన తిరుమల తిరుపతి ఏడుకొండల పరిధిలో అన్యమతస్తుల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అనుమతివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్, ఎమ్మార్, దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి 35.32 ఎకరాల్లో అనుమతి ఇచ్చారని, వాటి అనుమతులను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఏడుకొండలకు అనుకోని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. వారికి సమీపంలో ఉన్న భూములు కేటాయిస్తామని తెలిపారు. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో తిరుమలలో జరిగినవి అన్నీ ప్రజలు చూసారని..ఎన్నో అపవిత్ర కార్యక్రమాలు ఇక్కడ జరిగాయన్నారు. నేను చెప్పినట్లుగా తిరుమల నుంచే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించానని.. అందుకే ప్రభుత్వం మొదటి నియామకంగా ఈవో శ్యామలరావును నియమించడం జరిగిందన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
గతంలో తిరుమల ఐదు కొండలు అంటే దానిని తీవ్రంగా వ్యతిరేకించి తిరుమలకు పాదయాత్రగా వచ్చానని గుర్తు చేశారు. తిరుమల అటవీ శాతాన్ని 68.23నుంచి 90శాతంకు తీసుకెలుతామన్నారు. నేను 24 క్లైమోర్ మైన్స్ పేల్చాక కూడా బతికున్నానంటే అదంతా వెంకటేశ్వర స్వామి మహిత్యమేనన్నారు. ఎవరు కూడా తిరుమలను అపవిత్రం చేయాలని చూడవద్దన్నారు. టీటీడీ బోర్డు,అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రను కాపాడాలన్నారు.
తిరుమల్లో అన్యమతస్థులు పని చెయ్యకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని… ఇతర మతస్తులని గౌరవిస్తూనే, వారిని తిరుమలలో కాకుండా వేరే చోటుకు షిఫ్ట్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. అదే విధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామన్నారు. దేశంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎక్కడున్నా కాపాడుతామన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాల్లో నిర్మించాలని నిర్ణయించామని..దీనిపై అక్కడి సీఎంకు లేఖలు రాస్తామని చెప్పారు. విదేశాల్లో కూడా శ్రీవారి భక్తుల కోసం ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు.
ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టు..
అమరావతిలో శ్రీవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామని, కల్యాణం నిర్వహణతో అమరావతి పనులను ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టు ప్రారంభిస్తున్నామని, ఈ ట్రస్టుకు వచ్చిన విరాళాలతో పాటు శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. శ్రీవారి సేవను మరింత విస్తరిస్తామని, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిధి పేరుతో నూతన ట్రస్టుని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి అన్నదానం చేశారు. ఆనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకుని ముందుకు వస్తానని.. తన మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా కులదైవమైన స్వామి వారీ ఆశీస్సులు పొందడానికి వచ్చామన్నారు. ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఈ దఫా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా రూ.44లక్షలు విరాళంగా అందించానని తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్‌కు ఇప్పటి వరకు రూ. 2,200 కోట్ల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతకుముందు శ్రీపద్మావతి అతిథిగృహం వద్ద చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరిలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.