విధాత: ఒక అమాయకుడిని అన్యాయంగా ఇరికిద్దామని ప్రయత్నించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ కారణంగా అడ్డంగా దొరికిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లోని మీరట్ సమీపంలో ఉన్న ఖందావలీ అనే గ్రామంలో జరిగింది. ఇక్కడ రైతుగా ఉన్న అశోక్ త్యాగికి పొలం సరిహద్దుదారులతో భూ వివాదం ఉంది.
ఈ నేపథ్యంలో ఇతడిని లొంగదీసుకోవడానికి ప్రత్యర్థులు పోలీసులతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. ఐఏఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న అతడి కుమారుడు అంకిత్ త్యాగీని ఎలాగైనా కేసలో ఇరికించాలని పన్నాగం పన్నారు.
మంగళవారం రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు వీరి ఇంటికి వచ్చి మొత్తం ఇంటిని సోదా చేశారు. అయినా అనుమానాస్పదంగా ఏమీ కనబడకపోవడంతో వెళ్లిపోయారు. అయితే తర్వాత హఠాత్తుగా తిరిగి వచ్చి.. అంకిత్ త్యాగిని ఆయుధాలు కలిగి ఉన్నందుకు అరెస్టు చేస్తున్నామని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. దానికి రుజువుగా అతడి బైక్‌లోంచి గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో వారు ఆ ఇంట్లో సీసీటీవీ ఉందని గుర్తించలేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు విడుదల చేసిన సీసీటీవీ వీడియో లో ఇద్దరు పోలీసు సిబ్బంది అతడి బైక్‌లో ఏదో వస్తువును దొంగతనంగా పెడుతున్నట్లు రికార్డయింది. రెండో వీడియోలో మళ్లీ వారే తాము దానిని కొత్తగా కనుగొన్నట్లు బయటకు తీశారు.
అంకిత్ కుటుంబ సభ్యులు పట్టు విడవకుండా నిరసన తెలపడంతో పాటు ఈ వీడియోలను బయటకు విడుదల చేయడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో తప్పు చేశారని భావించిన ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ దేహత్ కమలేష్ బహదూర్ వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.