కేంద్ర బ‌డ్జెట్‌.. జనం ఆశలపై మళ్లీ నీళ్లే!

రాష్ట్రపతి ప్రసంగంతో తేలిపోతున్న సంగతి ఆర్థికం వదిలి.. భావోద్వేగ అంశాలపైనే ప్రసంగం ఆకలి తీర్చే పథకాలు అవసరమన్న ఆర్థిక ఫోరం పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ PRESIDENT MURMU BUDGET-2023 WEF విధాత‌: కేంద్ర ప్ర‌భుత్వం 2023-24 ఆర్థిక సంవత్స‌రానికిగాను ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ ఎలా ఉండ‌బోతున్న‌దో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేసిన ప్ర‌సంగంతో తేలిపోయింది. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో చేసిన హామీలు, వాటిని ఎలా నెర‌వేర్చారో, వాటి ఫ‌లితాలేవో చెప్ప‌కుండా.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్ […]

  • Publish Date - January 31, 2023 / 11:53 AM IST

  • రాష్ట్రపతి ప్రసంగంతో తేలిపోతున్న సంగతి
  • ఆర్థికం వదిలి.. భావోద్వేగ అంశాలపైనే ప్రసంగం
  • ఆకలి తీర్చే పథకాలు అవసరమన్న ఆర్థిక ఫోరం
  • పట్టించుకోని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌

PRESIDENT MURMU BUDGET-2023 WEF

విధాత‌: కేంద్ర ప్ర‌భుత్వం 2023-24 ఆర్థిక సంవత్స‌రానికిగాను ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ ఎలా ఉండ‌బోతున్న‌దో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేసిన ప్ర‌సంగంతో తేలిపోయింది. గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో చేసిన హామీలు, వాటిని ఎలా నెర‌వేర్చారో, వాటి ఫ‌లితాలేవో చెప్ప‌కుండా.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ట్రిపుల్ త‌లాక్ బిల్లు తేవ‌టం లాంటి రాజ‌కీయ‌ప‌ర‌మైన నినాదాల‌ను ప్రభుత్వం సాధించిన ఘ‌న‌కార్యాలుగా చెప్పుకోవ‌టం విమర్శలకు తావిచ్చింది. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు, నిరుద్యోగ నిర్మూల‌న‌, పెరుగుతున్న ధ‌ర‌ల నియంత్ర‌ణ లాంటి విష‌యాలేవీ ప్రస్తావించకపోగా.. ప్ర‌భుత్వం చాలా సాధించింద‌ని చెప్పుకొని రావ‌టంతో ఈసారి బ‌డ్జెట్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ప్ర‌జ‌ల దైనందిన జీవితాల‌తో సంబంధంలేని, నినాద‌ప్రాయ విధానాల‌ను చేత‌ప‌ట్టి భావోద్వేగాల‌ను ఎగ‌దోసి ఎన్నిక‌ల్లో గెలువ వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు రాష్ట్రపతి ప్రసంగం ద్వారా అర్థమైపోతున్నది. లేక‌పోతే… ఆర్టిక‌ల్ 370, ట్రిపుల్ త‌లాక్ రద్దు అంశాలను ఘ‌న‌కార్యాలుగా చెప్పుకోవ‌టం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. నిజానికి దేశ స‌గ‌టు జీవి తీవ్ర ఆర్థిక‌, సామాజిక సమస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్నాడు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు చుక్క‌ల్లో చేరాయి. నిత్యావ‌స‌రాలైన ప‌ప్పులు, నూనెలు, ఉల్లిగడ్డ‌లు, బియ్యం, గోధుమ‌ల ధ‌ర‌లు రెట్టింపు అయ్యాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెప్తున్నాయి. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర వెయ్యికి మించి.. సాధార‌ణ ప‌ల్లె జ‌నాన్ని తిరిగి క‌ట్టెల పొయ్యికి తీసుకుపోయింది.

ఈ నేప‌థ్యంలోనే.. ప్ర‌పంచ ఆర్థిక ఫోరం (WEF) దావోస్‌లో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌పంచ దేశాల‌కు అనేక సూచ‌న‌లు చేసింది. క‌రోనా అనంత‌రం ప్ర‌జ‌లు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, పేద‌రికంతో అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నార‌ని పేర్కొంటూ… వారి ఆక‌లి తీర్చే ప‌థ‌కాల‌ను రూపొందించాల‌ని ప్ర‌పంచ దేశాల‌కు సూచించింది. ముఖ్యంగా పేద‌ల‌కు ఆర్థిక సాయం అందేలా ప‌థ‌కాల‌ను రూపొందించాల‌ని తెలిపింది. అయినా.. మోదీ ప్ర‌భుత్వం మాత్రం పేద‌ల‌కు ఆస‌రాగా ఉన్న ప‌నికి ఆహార ప‌థ‌కాన్నీ (MGNREGA) నీరు గార్చింది. మ‌రింత ఎక్కువ ప‌నిదినాలు క‌ల్పించాల్సింది పోయి ఆ ప‌థ‌కాన్నే నిర్వీర్యం చేసింది.

ఇంటికో ఉద్యోగ‌మ‌ని, ఏడాదిలో రెండు కోట్ల ఉద్యోగాల‌నీ, అవినీతి నిర్మూల‌న అని అనేక వాగ్దానాల‌తో మోదీ ప్ర‌భుత్వం అధికారం చేజిక్కించుకొన్న‌ది. కానీ ఉద్యోగ క‌ల్ప‌న‌కు ఎలాంటి చర్యలూ తీసుకున్న పాపాన పోలేదు. దీంతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ నిరుద్యోగం మ‌రింత పెరిగింది. ప‌ట్ట‌ణ నిరుద్యోగం 10 శాతం ఉన్న‌ద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (CMIE) పేర్కొనటం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు… ఆక్స్‌ఫాం (OXFAM) నివేదిక విస్తుపోయే నిజాల‌ను బ‌య‌ట పెట్టింది. దేశంలో పేద‌రికం పెరిగిపోతున్న‌ద‌ని, ధ‌నిక‌-పేద ఆర్థిక అంత‌రాలు నానాటికీ పెరుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దేశ సంప‌ద‌లో 40శాతం కేవ‌లం ఒక‌శాతంగా ఉన్న ధ‌న‌వంతుల ద‌గ్గ‌రే పోగుప‌డి ఉన్న‌ద‌ని తెలిపింది. ఇలాంటి ప‌రిస్థితులే సామాజిక శాంతికి ప్ర‌తిబంధ‌క‌మ‌ని హెచ్చ‌రించింది.

దేశ జాతీయోత్ప‌త్తి ఆశాజ‌న‌కంగా ఉన్నా నిత్యావ‌స‌ర స‌ర‌కుల ధ‌ర‌లు పెర‌గ‌టం వ్య‌వ‌స్థాగ‌త‌మైన లోప‌మే త‌ప్ప మ‌రేమీ కాదు. దేశీయంగా.. ఎగుమ‌తులు-దిగుమ‌తుల వ్య‌త్యాసాన్ని (క‌రెంటు ఖాతా లోటు) స్వావ‌లంబ‌న విధానాలు అనుస‌రించ‌టం ద్వారా అధిగ‌మించ వ‌చ్చ‌ని నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఉత్ప‌త్తి, సంప‌దను ప్ర‌జ‌లంద‌రికీ పంప‌కం చేయ‌టంలో, అందేలా చూడ‌టంలో ప్ర‌భుత్వాల బాధ్య‌త ఉంటుంది. ఆ బాధ్య‌త‌ను మ‌న ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక పోవ‌టం ఫ‌లితంగానే ధాన్య‌రాసులు ఒక దిక్కు… ఆక‌లి చావులు ఇంకో దిక్కు అన్న‌ట్లు దేశ దుస్థితి ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో సాధార‌ణ ఎన్నిక‌ల ముంగిట ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకొనే విధంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న ఉంటుందా? లేక మాటలతో మాయచేసి.. పబ్బం గడుపుకొంటారా? అనేది కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌తో తేలిపోనున్నది.

Latest News