Site icon vidhaatha

Challa Vamshi chand Redd | పదేళ్లలో పాలమూరు వెనుకబడింది


Challa Vamshi chand Redd | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని సీడబ్ల్యుసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. పాలమూరు న్యాయయాత్ర పేరుతో బుధవారం మక్తల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. కృష్ణ మండలంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.


ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ గులాబీ ఎమ్మెల్యేలు పాలమూరును రాజకీయంగా వాడుకొని అభివృద్ధిని వదిలేశారన్నారు. ఇక్కడి వనరులు కొల్లగొట్టి గత ఎమ్మెల్యేలు రూ.కోట్ల సంపద వెనకేసుకున్నారని వంశీ ఆరోపించారు. పాలమూరులో నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్కటీ కూడా పూర్తి కాలేదని, అన్ని అసంపూర్తిగా వదిలేసి జిల్లా రైతాంగాన్నీ మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో గులాబీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదని వంశీ అన్నారు. అందుకే ప్రజలు బీ ఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పి కాంగ్రెస్ పై నమ్మకంతో అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.


పాలమూరు జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఈ న్యాయ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్ననని వంశీ పేర్కొన్నారు. ఇక్కడి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ పాదయాత్ర ప్రారంభంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version