Chandramukhi 2 |
‘చంద్రముఖి’ అనే పేరు వినబడగానే అంతా జ్యోతిక, అనుష్కలను గుర్తు చేసుకుంటారు. కానీ ఇప్పుడు వారి ప్లేస్‌లో బాలీవుడ్ భామ కంగనా రూపం కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ ఈ పార్ట్2లో హీరోగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘చంద్రముఖి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పి.వాసు దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారర్ జోనర్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘చంద్రముఖి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ ‘చంద్రముఖి 2’ రూపొందుతోంది.
రీసెంట్‌గా రాజు పాత్రలో ఉన్న రాఘవ లారెన్స్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమాలో చంద్రముఖిగా మెప్పించనున్న కంగనా రనౌత్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో కంగనాని చూసిన వారంతా.. జ్యోతిక, అనుష్కలేం సరిపోతారనేలా కామెంట్స్ చేస్తున్నారంటే.. ఆమె లుక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బంగారు అభరణాలు, పట్టు వస్త్రాలతో రాజ నర్తకి చంద్రముఖిగా కంగనా రనౌత్ మెస్మరైజ్ చేస్తోంది. వాస్తవానికి మొదట కంగనా రనౌత్ పేరు వినబడగానే.. అసలామె ఆ పాత్రకి సరిపోతుందా? అని అంతా పెదవి విరిచారు. కానీ ఈ లుక్‌తో కంగనా.. సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచేసింది. రీసెంట్‌గా విడుదలైన రాఘవ లారెన్స్ లుక్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కంగనా లుక్ పరంగా మాత్రం అంతా పాజిటివ్‌గానే స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
2005లో పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. పోటీకి ఎటువంటి స్టార్ చిత్రం ఉన్నా కూడా.. అన్నింటినీ బీట్ చేసి.. రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ వస్తుండటంతో మాములుగానే ఈ సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది.
వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో.. అన్ని రకాలుగానూ ఈ సినిమా ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కంగనా లుక్ మాత్రం వైరల్ అవుతోంది.