విధాత: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలు దాటడంలో పోటీపడ్డారు.
అయితే అగ్నిగుండాల సందర్భంగా పార్వతి జడల రామలింగేశ్వరులను పర్వత వాహనంపై ఊరేగిస్తున్న క్రమంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడం, వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు తోసివేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొక్కిసలాటలో పలువురు మహిళా భక్తులకు ,శివసత్తులకు, చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాదాయ, పోలీస్ శాఖలు తగిన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు తెల్లవారుజామున 6:30గంటలకు స్వామి వారి ధోపోత్సవం,అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం ఏడు గంటలకు మహా పూర్ణాహుతి, పుష్పోత్సవము,ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.