Site icon vidhaatha

వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కళ్యాణం

విధాత, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవోపేతంగా సాగింది. ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంతో చెర్వుగట్టు పులకించింది. తెల్లవారుజామున 4 గంటలకు బ్రాహ్మి ముహుర్తంలో తొలి మంచు తెరల తుంపరులు పూలవర్షంలా కురుస్తుండగా.. శివ భక్తుల హర హర మహాదేవ శంభో శంకర అంటూ సాగించిన శివనామస్మరణల మధ్య వధూవరులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

కళ్యాణోత్సవానికి ముందు ముస్తాబైన వధూవరులు పార్వతీ పరమేశ్వరుల ఎదుర్కోలు ఘట్టం అర్చక పండితుల వధూవరుల గుణగణనల వర్ణన ప్రవర మధ్య రసవత్తరంగా సాగింది. కళ్యాణ మండపంలో ఆసీనులైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర కళ్యాణ ఘట్టాన్ని వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితా అవధాన శాస్త్రి, నీలకంఠ శావాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మల అర్చక పండితుల బృందం శైవగమన శాస్త్రానుసారం వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య, భక్త జనం శివ నామస్మరణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు.

మాంగళ్యధారణ, తలంబ్రధారణ ఘట్టాలను నయనానందకరంగా నిర్వహించగా, లక్షలాది మంది భక్తులు కళ్యాణోత్సవ వేడుకను తిలకించి పులకించారు. పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవార్లకు తలంబ్రాల బియ్యం సమర్పించగా, తలంబ్రాలు బియ్యం రాశులుగా కనిపించాయి. కళ్యాణోత్సవాన్ని భక్తులంతా తిలకించేందుకు కొండ ప్రాంగణంలో పలు ఎల్ఈడి తెరలను సైతం ఏర్పాటు చేశారు.

కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాదుకా మొక్కులు, గర్భాలయంలో రామలింగేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. కల్యాణోత్సవానికి తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి శివ భక్తులు, శివసత్తులుభారీగా తరలిరాగా, చెరువుగట్టు కొండ ప్రాంతమంతా , గట్టు దారులన్ని భక్తులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రికి ముందే భక్తులు భారీగా కొండపైకి చేరుకొని చలిని మంచును సైతం లెక్కచేయకుండా శివనామస్మరణతో కళ్యాణోత్సవ వేడుకలను తిలకించారు. దేవాదాయ శాఖ పోలీస్ శాఖలు ప్రభుత్వ యంత్రాంగం భక్తుల రద్దీని నియంత్రించారు. బ్రహ్మోత్సవాల లో భాగంగా రేపు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల ఘట్టం నిర్వహించనున్నారు.

Exit mobile version