Site icon vidhaatha

చిరంజీవి గారు మీ ఫొటో సెషన్‌ ఆపితే.. నేను మాట్లాడాలి: గరికపాటి

విధాత‌, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్.. బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

చిరు సెల్ఫీలు ఆపితేనే ప్రసంగిస్తానన్న గరికపాటి

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే గరికపాటి నరసింహారావు ప్రసంగం మెదలు పెట్టిన సమయంలో.. చిరంజీవితో అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే చిరంజీవి సెల్ఫీలు ఆపితేనే తాను ప్రసంగిస్తానని.. లేకుంటే ప్రసంగం ఆపేసి‌.. వెళ్ళిపోతానంటూ గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. దీంతో సెల్ఫీలు ఆపి వచ్చి.. చిరంజీవి తన సీటులో కూర్చున్నారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా నిర్వహిస్తున్న గొప్ప సమ్మేళనం ‘అలయ్ బలయ్’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రేమ, సోదరాభావం అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చిరు పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్, మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రాంచందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా అతిథులకు బండారు విజయలక్ష్మి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అద్దంపట్టే రీతిలో కళాకారులు ఆట పాటలతో సందడి చేశారు.

Exit mobile version