విధాత: కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కొందరు ప్రేమిస్తారు, జత కట్టాలని కూడా అనుకుంటారు. పెళ్లయినా, జతకట్టటం అయినా ఒక వయసు నిండాక వ్యక్తిగతం. కానీ అంత స్వేఛ్ఛ ఇచ్చే సమాజాన్ని మనం నిర్మించుకోలేదు. దానికి తోడు ప్రమాదాలు ప్రపంచం నిండా ఉండనే ఉన్నాయి. అన్నీ కలిసి జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఎదుర్కొని నిలవమని సవాలు విసురుతాయి. ఈ విషయాలనే రెండు సమాంతర కథలుగా తీసిన సినిమా ‘మసాన్’.
మొదటి కథ
ధనికులు, గొప్పవారు స్టార్ హోటళ్లలో చేసే రంకుకి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. విషయాలు బయటికి రాకుండా కాపాడుతుంది. అర్బన్ లైఫ్ స్టయిల్లో అది భాగమవుతుంది. కానీ గతిలేని వాడు కామం తీర్చు కోవాలనుకుంటే అది నేరం అవుతుంది. నేరంగా పరిగణించి కటకటాల వెనక్కి తొయ్యాలని చూస్తుంది. గుట్టు రట్టు చేసి సమాజంలో పరువు తీసి చావుకు కారణం అవుతుంది. వ్యక్తి స్వేచ్చ, నైతిక విలువలు చచ్చిన ఏ దేశమైనా స్మశానం కాక మరేమిటి?
తల్లి లేని అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. తెలిసీ తెలియక లాడ్జ్‌కి వచ్చింది. పోలీసులకు పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి దగ్గరైతే వ్యబిచారం అనే అంటుంది లోకం. అలాంటి పరిస్థితిని, పరువును, పిరికితనాన్ని అసరా తీసుకొని అధికారం చూపిస్తారు పోలీసులు. ఆ ఇద్దరు తెలిసీ తెలియని జంటను అపరాధ భావంలోకి తోసి పోలీసులు ఆడుకుంటారు.
పరువుపోతుందని ఆ ప్రియుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంటాడు. గంగ ఒడ్డున కర్మకాండలు చేసుకుంటూ బతికే ఒంటరి తండ్రికి కూతురు విషయం తెలిసి నిస్సహాయంగా కుమిలిపోతాడు. అమ్మాయి పరువు కావాలంటే మూడు లక్షలిమ్మంటాడు పోలీసు. తను తప్పు చెయ్యలేదన్న నమ్మకంలో ఉన్న ఆ అమ్మాయి గట్టిగానే ఉంటుంది. పరువు కోసం ఆ తండ్రి ముడుపు చెల్లించుకోవడం, ఆమె పై చదువులకు ఊరు విడిచి పోవడమే మొదటి కథ.
రెండవ కథ
ప్రేమ చిత్రమైంది. వయసు రాగానే అవతలి వ్యక్తిన ప్రేమించాలని అనిపిస్తుంది. చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరు నచ్చుతారు. నచ్చావు అని చెప్పే ప్రయత్నాలు మొదలవుతాయి. అవతలి వ్యక్తి ఒప్పుకుంటే ఆనందం వర్ణించలేనిది. ఇక తర్వాత తంతుకి ప్రణాళికలు మొదలవుతాయి. ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉంటుందో అక్కడే విడదీసే విషయాలూ ఉంటాయి. అవి మనుషులో, పరిస్థితులో, కులగోత్రాలో, డబ్బూ అంతస్తులో, మరణమో ఏదైనా కావచ్చు. దాన్ని ఎదుర్కొని నిలబడడమే ప్రేమ పరీక్ష.
గంగ ఒడ్డున శవాలని తగలబెట్టే కులంలో పుట్టిన యువకుడు, వృత్తి చేస్తూనే చదువుకుంటూ ఉంటాడు. చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ. ఒక అమ్మాయి తారసపడి, ఇష్టపడి ప్రేమిస్తాడు. అమ్మాయి కూడా అతడిని ఇష్ట పడుతుంది. కులం వేరు చేస్తుందేమో అని భయపడి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వారిని విడదీసే మరో కారణం పొంచి ఉంటుంది. వారిని శాశ్వతంగా విడదీస్తుంది. మనసు వికలమై నిత్య రోదనగా మిగిలి పోతాడు అతడు. తిరిగి సాంత్వన కుదుర్చుకుని నిలబడడమే కథ
సమాంతరంగా అల్లిన రెండు కథల్లో ముఖ్య పాత్రలు గంగానది ఒడ్డున ఒకరికొకరు తారస పడడంతో ముగుస్తుంది సినిమా. కాశీ పవిత్ర క్షేత్రం. మహా స్మశానం. చావుపుట్టుకల నిలయం. చచ్చిన మనుషులు, మనసులు స్వేచ్ఛను పొందే చోటు. నీరజ్ గైవాన్ మొదటి సారి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ కంటే కూడా కాశీ బ్యాక్ డ్రాప్ లో మనం ప్రస్తుత భారతీయ వ్యవస్థని, మారుమూల ప్రాంతాల్లో టెక్నాలజీ మన జీవితాలను ప్రభావితం చేస్తున్న తీరుని, దేశంలోని ప్రాంతీయ పరిస్థితులని, జనజీవన దృక్పథాన్ని, ప్రభుత్వ యంత్రాంగ పనితీరుని, మానవ సంబంధాలనూ చక్కగా చూపించింది.
చిత్రీకరణ మొత్తం చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అవినాష్ అరుణ్ సహజ శైలీ (నాచురల్ రియలిజమ్ ) లో చేసిన సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. ఇండియన్ ఓపినియన్ అనే మ్యూజిక్ బాండ్ చేసిన నేపథ్య సంగీతం కూడా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూ చక్కగా సాగింది. పాటలు భావోద్వేగాలను తట్టిలేపుతాయి. నటీనటుల అతి సహజ నటన మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ కలుగ జేస్తుంది. గుంభనంగా సాగిన కథనం సినిమా తర్వాత కూడా కచ్చితంగా వెంటాడుతుంది.
మేయిన్ స్ట్రీం సినిమా సమాజంలో గ్లిట్టర్నేస్ ను, సూడో భావోద్వేగాలను చూపితే ఇలాంటి సినిమా సహజ సమాజాన్ని కళ్ల ముందుంచుతుంది. జీవితానికి దూరంగా ఉన్న ఎన్ని సినిమాలు చూసినా రాని భావనాత్మక ఆనందం పొందవచ్చు. మనం కాసేపు అలా కాశీ వీధుల్లో తిరిగి రావాలని అనుకుంటే తప్పక ఈ సినిమా చూడొచ్చు.