Site icon vidhaatha

మునుగోడు ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ సమీక్ష!.. 30న బహిరంగ సభ

విధాత, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సాయంత్రం మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ములాయం సింగ్ యాదవ్‌ అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన విషయం విదితమే.

ఢిల్లీ పర్యటనలో భాగంగా టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ కార్యాలయాల పనులను పరిశీలించారు. ఇక పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపీలతో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి.. అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్టేట్ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికాలు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

30న కేసీఆర్ బహిరంగ సభ

ఈ నెల 30న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 30 న సీఎం కేసీఆర్ బహిరంగ సభతో మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు.

Exit mobile version