నా ముఖం చూసి ఓట్లేయండి.. ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో సీఎం కేసీఆర్‌

  • Publish Date - November 5, 2023 / 03:03 PM IST
  • ఉద్యోగులు న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించిందే లేదు
  • మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌
  • అబద్ధాలు, మోసపూరిత‌ వాగ్ధానాలు
  • ఎన్నిక‌ల్లో తంతుగా మారిపోయాయి
  • దేశంలో రాజకీయ పరిణితి రావాలి
  • వనమా వెంకటేశ్వర్‌రావు మంచి మనిషి
  • కేసీఆర్‌ ఫేస్ చూసి ఆయ‌న‌కు ఓటేయాలి
  • మీకు తుప్ప‌లు, తుమ్మ ముళ్లు కావాల్నో,
  • పువ్వాడ పువ్వులు కావాల్నో తేల్చుకోండి
  • ఖ‌మ్మం, కొత్త‌గూడెం ప్రజాా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. రావాల్సినంత రాజకీయ పరిణతి రాలేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి మన దేశంలో రాలేదు. పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఎన్నికలొస్తే అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టుకోవడం, మోసపూరిత వాగ్ధానాలు చేయ‌డం మ‌న‌ దేశంలో తంతుగా మారిపోయింద‌ని అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటును ఆగమాగం వేస్తే మన తలరాత కింద మీదైతద‌ని హెచ్చ‌రించారు.


త‌న ముఖం చూసి ఓట్లేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఆదివారం ఖ‌మ్మం, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. ‘ఈ రోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడుతున్నామ‌ని కేసీఆర్ చెప్పారు. వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేన‌ని, అందులో డౌట్ లేద‌ని అన్నారు. తానే వ‌చ్చి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తాన‌ని తెలిపారు. ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి స‌హాయం అందేవ‌ర‌కూ ద‌ళిత బంధు కొన‌సాగుతుంద‌ని చెప్పారు.


 


ఢిల్లీ గులామ్‌లకు గులామ్‌ అవుదామా?

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ జెండా ఎత్తినయా? తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడన్నా భుజానికి ఎత్తుకున్నరా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌ నాయకులకు సొంత‌ కథ ఉండద‌ని, ఢిల్లీలో స్విచ్‌వేస్తే ఇక్క‌డ లైట్‌ వెలుగుతుంద‌ని ఎద్దేవా చేశారు. ఢిల్లీ గులామ్‌ల కింద ఉండి.. మనం కూడా గులామ్‌ అవుదామా? అని ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల యుగం రాబోతున్నద‌ని, ఎక్కడి వారు అక్కడ ఉంటేనే.. ఆ రాష్ట్రం ప్రయోజనాలు కాపాడుతార‌ని చెప్పారు.

ప‌దేళ్ల‌లో న‌ల్జ‌బ్యాడ్జీల్లేవు

‘ఉద్యోగ సోదరులకు మనవి చేస్తున్నా. మీరందరూ గత ప్రభుత్వాలను చూశారు. పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీల ప్రదర్శన చేయలేదు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఎలా వెళ్తున్నామో తెలుసు. చిన్న ఉద్యోగులు, కాంటాక్ట్‌ ఔటర్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కడుపులు నింపాలని.. భారత్‌లోనే తొలిసారిగా పీఆర్సీ ఇస్తే.. దాంతో సమానంగా జీతాలు పెంచింది చూశారు’ అని చెప్పారు. కాంగ్రెస్ 50 ఏళ్లు ప‌రిపాలిస్తే బీఆరెస్ ప‌దేళ్లుగా ప‌రిపాలిస్తున్న‌ద‌ని, తేడా అర్థం చేసుకోవాల‌ని కోరారు.


పోడు భూముల‌కు ప‌ట్టాలిచ్చామ‌ని, ఆదివాసీల‌పై కేసులు ఎత్తివేశామ‌ని తెలిపారు. నీటిని వడిసి పట్టడం వల్ల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి వ‌చ్చాయ‌ని చెప్పారు. ‘పువ్వాడ అజయ్‌ని గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటడు. కాదని తుమ్మలు, తుప్పలు తెచ్చుకుంటే మీకే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటయ్‌. మరి తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి’ అన్నారు. వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు మంచి మ‌నిషి అని, ప్ర‌జ‌ల‌కోసం ప‌నిచేస్తార‌ని చెప్పారు. త‌న ముఖం చూసి ఆయ‌న‌కు ఓట్లేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మాటలు అందరికీ వస్తయ్‌..

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఇద్ద‌రు క‌ర‌క‌ట ధ‌మ‌న‌కులు ఉన్నార‌ని తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారిద్ద‌రి పీడ ఖ‌మ్మానికి వ‌దిలింద‌ని, ఖ‌మ్మం శుభ్రంగా ఉన్న‌ద‌ని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా పద్ధతి ఉంటుంద‌ని అన్నారు. ‘మాటలు అందరికీ వస్తాయ్‌. తిట్టాలంటే తిట్లు తక్కువ ఉన్నయా? రేపు గియ్యాళ్లదాక తిట్టొచ్చు. అదికాదు కదా రాజకీయం అంటే? అని ప్ర‌శ్నించారు. పొంగులేటిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లను ఒక్కరినిగూడ.. అసెంబ్లీ గడప తొక్కనియ్య అని ఒక అర్భకుడు మాట్లాడుతున్నడు. నువ్వు ఖమ్మం ప్రజలను గుత్తపట్టినవా? జిల్లాకు జిల్లానే కొనేసినవా? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? అని అన్నారు.

ఇదీ సింగ‌రేణి చ‌రిత్ర‌

134 ఏళ్ల చ‌రిత్ర ఉన్న సింగ‌రేణి వంద‌శాతం మ‌న‌కే ఉండేద‌ని, కానీ.. చేత‌కాని కాంగ్రెస్ ద‌ద్ద‌మ్మ‌లు అప్పులు తెచ్చి 40 ఏళ్లు తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతోనే కేంద్రానికి 49 శాతం వాటా వ‌చ్చింద‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. లేకుంటే మ‌న గ‌నులు మ‌న‌కే ఉండేవ‌ని అన్నారు. బీఆరెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణి న‌డ‌క‌నే మార్చామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టం ఉండేద‌ని, తెలంగాణ వచ్చిన వెంటనే 3శాతం తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చామ‌ని పేర్కొన్నారు.


కంపెనీ టర్నోవర్ 33 వేల కోట్లకు తీసుకుని పోయామ‌న్నారు. లాభాలు 2184 కోట్లకు తీసుకెళ్లామ‌ని తెలిపారు. ‘గతంలో దసరాకు 60, 70 కోట్లు ఇచ్చేది. మనం ఈ దసరాకు సింగరేణి కార్మికులకు పంచిన లాభం రూ.700 కోట్లు’ అని తెలిపారు. తెలంగాణ వచ్చినంక తొమ్మిదన్నరేళ్లుగా నూతనంగా 19463 మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు. సింగ‌రేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ యూనియన్‌ల‌ని మండిప‌డ్డారు.