Site icon vidhaatha

ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

విధాత, హైదరాబాద్‌ : ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి ఎన్నికల్లో రెండు చోట్ల ఓట్లు వేయాలని కోరారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి బుధవారం రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి మాణిక్కరాజ్ కణ్ణన్‌ కలిసి ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి మాట్లాడిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో రెండు ఓట్లు వేయాలని ప్రజలను రెచ్చగొట్టడాన్ని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మునుగోడు ప్రజలతో నిర్వహించిన సమావేశంలో సుధీర్ రెడ్డి.. జనరల్ ఎలక్షన్ సమయంలో ప్రజలు ఇక్కడ ఓటు వేయాలని.. తర్వాత అక్కడ కూడా ఓటు వేయాలని చెప్పారు’’ అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా అందజేసినట్టుగా చెప్పారు.

సుధీర్ రెడ్డి మాటలు దొంగ ఓటు వేయాలని చెప్పినట్టుగా ఉన్నాయని.. ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదనపు ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ఆయనను అనర్హునిగా ప్రకటించాలని అభ్యర్థించడం జరిగిందని.. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు.

Exit mobile version