Congress
- సీడబ్ల్యూసీ నిర్ణయాలపై ప్రజల ఆసక్తి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల
- నేపథ్యంలో మీటింగ్‌కు అధిక ప్రాధాన్యం
- ఏఐసీసీ కమ్యూనికేషన్స్ చైర్మన్ పవన్ ఖేరా
విధాత: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం రెండ్రోజులపాటు (శనివారం, ఆదివారం) హైదరాబాద్‌లో జరుగనున్న నేపథ్యంలో దేశ ప్రజల చూపు అంతా హైదరాబాద్ పైనే ఉన్నదని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ చైర్మన్ పవన్ ఖేరా చెప్పారు. కాంగ్రెస్ లైన్ ఏమిటనేది దేశం గమనిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పారు.
హోటల్ తాజ్‌కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కావడానికి ముందు శనివారం ఉదయం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాజా సీడబ్ల్యూసీ మీటింగ్‌కు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు. మీటింగ్‌లో తీసుకొనే నిర్ణయాలను సాయంత్రం మరోసారి ప్రెస్‌మీట్ నిర్వహించి వెల్లడిస్తామని చెప్పారు.
కాంగ్రెస్‌ను చూసి నేర్చుకోవాలి
కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉన్నదని పవన్‌ఖేరా చెప్పారు. పార్టీలో అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామని తెలిపారు. సభ్యుల విమర్శలను, ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మిగతా పార్టీల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని తెలిపారు.
పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నుకున్నామని గుర్తుచేశారు. ఈ ప్రజాస్వామ్య విధానమే కాంగ్రెస్‌కు ఇతర పార్టీలకు ఉన్నతేడా అని పేర్కొన్నారు. ఒకరిద్దరు తీసుకొనే నిర్ణయాలే కొన్ని పార్టీల విధానాలని చెప్పారు. అలాంటి పార్టీలు తమను చూసి నేర్చుకోవాలని సూచించారు.
భారత్ జోడో యాత్రను నిర్ణయించేది ప్రజలే
పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర షెడ్యూల్‌ను దేశ ప్రజలే నిర్ణయిస్తున్నట్టు పవన్‌ఖేరా వెల్లడించారు. యాత్ర కరిక్యూలాన్ని ప్రజలే రూపొందిస్తున్నారని తెలిపారు. 4000 కిలోమీటర్లు ఆయన యాత్ర చేపట్టారని, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉన్నదని చెప్పారు. లారీ డ్రైవర్లతో మాట్లాడినా, కశ్మీర్‌లో బైక్‌యాత్ర నిర్వహించినా ఇదంతా భారత్ జోడో యాత్రలో భాగమేనని వెల్లడించారు. ప్రజల నుంచి యాత్రకు విశేష స్పందన లభిస్తున్నదని చెప్పారు.
ప్రజల మధ్యే కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఎప్పూడూ ప్రజలకు దూరం కాలేదని, ప్రజల మధ్యే ఉన్నదని, వారి సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నదని ఏఐసీసీ కమ్యూనికేషన్స్ చైర్మన్ పవన్‌ఖేరా వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొనే ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నదని చెప్పారు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు మోదీ, అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపై ఉన్నాయని తెలిపారు. దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాంగ్రెస్ రక్షణ కవచంగా ఉంటుందని ఆయన చెప్పారు.