విధాత: కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ పాదయాత్రలను నిర్వహించనునట్లు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ, బ్లాక్, మండల స్థాయిలలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు కొనసాగుతాయని తెలిపారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ అదిలాబాద్ లేదా భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏదైనా ఒక చోట వారు పాదయాత్రల ప్రారంభోత్సవానికి హాజరు అవుతారని తెలిపారు. తాను అన్ని నియోజకవర్గాలు చుట్టే విధంగా పాదయాత్రలలో పాల్గొంటానన్నారు.
సీఎల్పీ నేత ప్రచార కమిటీ చైర్మన్లు పాదయాత్రలో పాల్గొంటారని, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా నిర్దేశించిన ప్రాంతాల్లో పాదయాత్రలకు హాజరవుతారని తెలిపారు.రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందేశాలను, లక్ష్యాలను, కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని వివరించారు. పార్టీ విధానాలపై బహిరంగంగా ఎవరైనా మాట్లాడవచ్చు అని కానీ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవు అని ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేసినట్లు తెలిపారు.