– ఐదేళ్లు నిత్యం ప్రజలతోనే ఉన్నా
– వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిక
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యలపై పోరాడుతూ, వారి పక్షం వహిస్తూ ప్రశ్నించే గొంతుక అంటే బీఆర్ఎస్ కి గిట్టదని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. గత ఐదేళ్లుగా ములుగులో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు కొందరు చిల్లర విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం కొత్తగూడ మండలం గుంజెడు, పోగుల్లపల్లి, మైలారం తండాలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజా సమస్యల్లో నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. కరోనా కాలంలో, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందించానన్నారు. అధికార పార్టీలో ఉండి అత్యున్నత పదవులు పొందిన కూడా ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతూ మోసం చెయ్యడానికి వస్తున్నారని బీఆరెస్ నాయకులను విమర్శించారు.
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని సీతక్క విమర్శించారు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం గద్దెనెక్కి, రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య, దళితులకు 3 ఎకరాల భూమి, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. వివిధ పార్టీల నుండి 50 కుటుంబాలకు పైగా కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ గెలుపులో భాగమైనందుకు ధన్యవాదాలు తెలియజేశారు.