Congress |
- ప్రియాంకతో చర్చించిన ఎంపీ కోమటిరెడ్డి
- ఖమ్మం, కొల్హాపూర్‌లలో భారీ బహిరంగ సభలకు ప్లాన్
- రాష్ట్రంలో 2 రోజులు పర్యటించనున్న ప్రియాంక
- త్వరలో షెడ్యూల్ ఖరారు
విధాత: బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. అయితే వీరితో పాటు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ అందరూ కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లేనని చేసిన వ్యాఖ్యలతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరతారన్నప్రచారానికి బలం చేకూరుతోంది.
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారిని కలిశాను. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులపై దాదాపు 20 నిమిషాలపాటు చర్చించాను. అనేక అంశాలపై ఇద్దరం మాట్లాడుకున్నాం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) June 16, 2023
కాగా పొంగులేటి, జూపల్లిలు ఈనెల19,20 తేదీలలో ఢిల్లీ వెళ్లి ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ పెద్దలను కలువనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పెద్దలు వారిని ఆహ్వానించినట్లు తెలిసింది. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో చర్చించిన తరువాత వారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే తేదీలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అధిష్టానం నిర్ణయించిన తరువాత ఖమ్మం, కొల్హాపూర్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.