విధాత: రైతాంగ సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ టీ కాంగ్రెస్ పిలుపుమేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి.. ధర్నాలు నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన కాంగ్రెస్ ధర్నాలో పీసీసీ సభ్యులు దుబ్బాక నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల మేరకు రైతు రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం ఇవ్వకుండా, ధరణి సమస్యలతో రైతన్నలను ఇబ్బందులు పాలు చేస్తుందన్నారు.
నల్గొండ జిల్లాలో శ్రీశైలం సొరంగం, ఉదయ సముద్రం ప్రాజెక్టులను ఎన్నికల్లో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ వాటికి నిధులు ఇవ్వకుండా జిల్లా ప్రజలకు, రైతాంగానికి అన్యాయం చేశారన్నారు. ఉచిత విద్యుత్ క్షేత్రస్థాయిలో కోతల విద్యుత్ గా మారిందన్నారు.
దాన్యం కొనుగోలులో సమస్య లతో రైతాంగం అష్టకష్టాలు పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మళ్లీ రైతులకు పండుగ రోజులు వస్తాయని.. ఇందుకోసం కోసం పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నాయక్, వున్న కైలాష్, చలమల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.