Site icon vidhaatha

కాంగ్రెస్, BRS సవాళ్లు.. భూపాల్ పల్లిలో 144 సెక్షన్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ BRS పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పరస్పర ఆరోపణలు, దాడుల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చేసిన విమర్శలు, ప్రతిగా కేటీఆర్ సభలో చేసిన విమర్శలు, పరస్పర అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి దిగారు.

బహిరంగ చర్చకు గురువారం ముహూర్తం

మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ పై టిఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడితో పరిస్థితి అదుపుతప్పే అవకాశం నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ఇరు పార్టీల నాయకులు చేసుకున్న సవాల్లతో పరిస్థితి చేయి దాటే అవకాశాలు ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ప్రకటించారు.

రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి

రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. 2వ తేదీ నుండి వారం వరకు జిల్లా కేంద్రం లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులుగా గుమిగుడవద్దని కోరారు.
శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా రాజకీయ పార్టీల నాయకుల సవాళ్లకు, బహిరంగ చర్చలకు పోలీసు శాఖ అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇరువర్గాల మీద కేసులు నమోదు

మంగళ వారం జరిగిన ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవలు, దాడుల విషయంలో రెండూ పార్టీల కార్యకర్తల మీద కేసులు నమోదు చేశామని, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో చర్చలకు ఎవరికి ఎటువంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదిలేది లేదని, చట్ట పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సే పోలీసుల అభిమతమని ఎస్పి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version