Site icon vidhaatha

Revanth Reddy | పరేడ్‌గ్రౌండ్స్‌ ఇవ్వకుండా కుట్ర.. ఎన్ని అడ్డంకులొచ్చినా సభ నిర్వహిస్తాం: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

విధాత‌, హైద‌రాబాద్‌: హైదరాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో కాంగ్రెస్‌ బహిరంగసభ నిర్వహించకుండా అధికార బీఆరెస్‌, కేంద్రంలోని బీజేపీ సర్కారులు కుట్ర చేశాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భవన్‌లో జ‌రిగిన‌ టీపీసీసీ విస్తృత అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన పరేడ్‌గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో గొప్ప బహిరంగసభ నిర్వహించతలపెట్టి, దానికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 2వ తేదీనే రక్షణశాఖకు లేఖ ఇచ్చామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కానీ.. కాంగ్రెస్‌కు పరేడ్‌గ్రౌండ్స్‌ ఇవ్వకుండా బీఆరెస్‌, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని, పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం సైతం కుట్రదారుడిగా మారడం దారుణమ‌న్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని రేవంత్ పేర్కొన్నారు. బీఆరెస్, బీజేపీ కుట్ర చేసి అక్కడ కూడా అనుమతి ఇవ్వకున్నా, కార్యక్రమం వాయిదా వేసేది లేదని స్ప‌ష్టం చేశారు. ఔటర్ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బీజేపీ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచుకు నెట్టేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయన్నారు. 17న జ‌రిగే సభ ద్వారా దేశానికి కాంగ్రెస్ గొప్ప సందేశాన్ని ఇవ్వనున్న‌ట్లు తెలిపారు. ఆ సభలో ఐదు గ్యారెంటీలను ప్రకటించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఆమె ప్రకటించే ఐదు గ్యారెంటీలను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని తీసుకుంటున్నట్టు తెలిపారు.

119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు పర్యటిస్తారని వెల్ల‌డించారు. బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చి, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ స‌మావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజా నర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, మాజీ ఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్,అజారుద్దీన్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ జోడో యాత్రకు ఏడాది

గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారు. ఈ నెల 7 తో జోడో యాత్రకు ఏడాది పూర్తవుతున్న‌ది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించి ఉత్సవాలు జరపాలని పార్టీ శ్రేణుల‌కు రేవంత్ పిలుపునిచ్చారు.

ఇందుకు 119 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించాలని, జోడో యాత్ర ఉత్సవాలు, సీడబ్ల్యూసీ సమావేశాల గురించి కోఆర్డినెటర్లు వివరించాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు మూడు పదవులు ఇచ్చినందుకు ఏఐసీసీకి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు వెల్ల‌డించారు.

Exit mobile version