రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS).. రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కాదు.. ఎలాంటి ఆడిట్‌కూ లోబడి ఉండదు. ఆదాయం పన్ను చట్టం పరిధిలోకి కూడా రాదు. కానీ, RSS నిధులను సేకరిస్తున్నది. దేశీయ, విదేశీ విరాళాలను (నిధులను) కూడా అందుకుంటున్నది. RSSకు విరాళాలు ఎలా అందుతాయి? ఎవరు ఇస్తారు? ఇప్పటివరకు సేకరించిన విరాళాలు ఎన్ని? వంటివి ఎవరికీ తెలియదు. లెక్కా పత్రం ఉండదు. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సంస్థగా చెప్పుకొనే RSSకు స్పష్టంగా నిధులు వచ్చే మార్గం లేదు. ఒక సంస్థగా RSSపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, న్యూఢిల్లీలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆ సంస్థ మూడు టవర్లను నిర్మిస్తున్నది. నిధులు మాయ.. నిర్మాణాలు మాత్రం నిజం!
విధాత: రాజధాని ఢిల్లీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నది. ప్రజలు ఇచ్చిన విరాళాలతో భవనాన్ని కడుతున్నట్టు చెప్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీస్ బేరర్లు తమ భావజాలానికి మద్దతు ఇచ్చే వ్యక్తులను సంప్రదించి విరాళాలు సేకరిస్తున్నట్టు పేర్కొంటున్నది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆఫీస్ బేరర్లు కూడా తమ సంస్థకు సహాయం చేస్తున్నారని కలరింగ్ ఇస్తున్నది.
2016 నుంచి నిర్మాణ పనులు
ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు 2016 నుంచి కొనసాగుతున్నాయి. మూడు టవర్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, ఒక టవర్‌ను ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఢిల్లీలోని ఉదాసిన్ ఆశ్రమం కేంద్రం ఆ సంస్థ ప్రస్తుతం పనిచేస్తున్నది. ఇక్కడి నుంచే ఆ సంస్థ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
సంఘ్ శ్రేయోభిలాషుల సహకారం
ఢిల్లీలోని ఝండేవాలన్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఆర్ఎస్ఎస్ కేంద్రం కార్యాలయం ‘కేశవ్ కుంజ్’ నిర్మాణానికి అవసరమైన నిధులను కేశవ్ స్మారక్ సమితి సేకరిస్తున్నట్టు ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు తెలిపాయి. నిర్మాణ పనులకు ‘కేశవ్ కుంజ్ నవరచన ప్రకల్ప్’ అని పేరు పెట్టారు. సంఘ్ చేసే ప్రతి పని సమాజం మద్దతుతో జరుగుతున్నదని, చెక్కుల ద్వారానే విరాళాలు తీసుకుంటున్నామని, సంఘ్ శ్రేయోభిలాషులు ఎవరైనా ఇందుకు సహకరిస్తారని వెల్లడించాయి.
3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో..
ఝండేవాలన్‌లో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే సంఘ్ కొత్త భవనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2016 నవంబర్ లో శంకుస్థాపన చేశారు. ఇక్కడ మూడు టవర్ల పనులు జరుగుతున్నాయి. మొదటి టవర్ ను 12 అంతస్థులతో నిర్మిస్తున్నారు.
అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు, నిర్మాణంలో ఉన్న ఈ భవనం నుంచే భగవత్ మీడియా సమావేశంలో నిర్వహించారు. కాగా, 2016లో నోట్ల రద్దు తర్వాత దేశంలోని ప్రతి జిల్లాలో భూమిని కొనుగోలు చేసి, అక్కడ కార్యాలయాలు నిర్మిస్తామని బీజేపీ వెల్లడించింది. భారతదేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా బీజేపీ రికార్డుల్లో ఉన్నది.
ప్రకాశ్ అంబేద్కర్ ప్రశ్నకు జవాబేది?
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ఒక సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌పై అనేక ప్రశ్నలను లేవనెత్తారు. సంస్థను ఎందుకు రిజస్టర్ చేయలేదని ప్రశ్నించారు. ఆ సంస్థ ఆదాయం పన్ను ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.