Site icon vidhaatha

కంటెంట్ ఉంటేనే.. సినిమాలకు వసూళ్లు: బ్ర‌హ్మానందం

విధాత: తెలుగు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. పూర్తిస్థాయి కామెడీ చిత్రాలను తీసే పరిశ్రమగా టాలీవుడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. నాటి రేలంగి, రమణారెడ్డి వాళ్లందర్నీ పక్కన పెడితే మొన్నటికి మొన్న రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ ఇలా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగులో ఉన్నంతమంది కమెడియన్లు మరే భాషలోనూ లేరంటే అతిశయోక్తి కాదేమో!.

అయితే ఇప్పుడు బ్రహ్మానందం, బాబు మోహన్, అలీ వంటి వారి జోరు తగ్గింది. వెన్నెల కిషోర్, సప్తగిరి, తాగుబోతు రమేష్, జబర్దస్త్ టీమ్స్‌లోని సభ్యులు కామెడీ పాత్రలు చేస్తున్నారు. నిజానికి కామెడీ చేయగలిగిన వాడు ఏ రసాన్నైనా ఈజీగా పోషించగలడు. బ్రహ్మానందం నటించిన అమ్మ, బాబాయ్ హోటల్ వంటి చిత్రాలు చూస్తే ఆయన నటన సత్తా ఏమిటో తెలుస్తుంది.

తెలుగులో కూడా నాటి కాలం నుంచే హాస్య‌ద‌ర్శ‌కులు ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో కూడా జంధ్యాల, పెద్ద వంశీ, రేలంగి నరసింహారావు, ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఎస్వీ కృష్ణారెడ్డి.. తాజాగా అనిల్ రావిపూడి, త్రినాధరావు నక్కిన ఇలాంటి కామెడీని పండించే దర్శకులు వస్తూనే ఉన్నారు. కానీ నాటి జంధ్యాలతో పోటీ పడగలిగిన దర్శకుడు మాత్రం రాడు.. రాలేడు అంటే అతిశయోక్తి అస్సలు కానే కాదు.

ఇక విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో వందల‌ సినిమాల్లో హాస్య నటుడుగా నటించి మరెన్నో అవార్డులను రివార్డులను గెలుచుకున్నారు. అయితే ప్రస్తుతం వయసు పైప‌డ‌టంతో బ్రహ్మానందం ఎక్కువ సినిమాల్లో నటించకుండా మంచి కథ, పాత్ర, ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇటీవలే పంచతంత్రం అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా ఓ ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. హాస్య నటులు తీసే సినిమాలు మంచి సక్సెస్ కావాలి.. హాస్యం బయటకు రావాలని నా గురువు జంధ్యాల ఎప్పుడూ నాకు చెప్పేవారు. హాస్యాన్ని బతికించాలని, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యాను. ఇకపోతే ఇండస్ట్రీలో ఏ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా మంచి హిట్ అవుతుంది.. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసాలు ఉండవు. కేవలం కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలు పెద్దవైనా, చిన్నవైనా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్లు రాబడతాయని అన్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Exit mobile version