Site icon vidhaatha

CWC | నేడు సీడ‌బ్ల్యుసీ భేటీ.. హైద‌రాబాద్‌కు వ‌స్తున్న ఆగ్ర‌నేత‌లు

CWC |

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ హైద‌రాబాద్‌ను వేదిక‌గా చేసుకున్న‌ది. తొలిసారి హైద‌రాబాద్ గ‌డ్డ‌పై శ‌ని, ఆదివారాల‌లో జ‌రిగే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ(సీడ‌బ్ల్యుసీ) స‌మావేశానికి పార్టీ అగ్ర‌నేత‌లంతా వ‌రుస‌గా హైద‌రాబాద్‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. ఐఏసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌, జైరాంర‌మేశ్‌లను పీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క త‌దిత‌ర నేత‌లు రిసీవ్ చేసుకున్నారు. శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు దాదాపు 50 మందికి పైగా నేత‌లు హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

అధిష్టానం పెద్ద‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లికార్జున ఖ‌ర్గేలతో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్‌కు చేరుకుంటారు. సీడ‌బ్ల్యుసీ స‌మావేశంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన నేత‌ల‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాజ్‌కృష్ణ హోట‌ల్‌లో బ‌స ఏర్పాటు చేసింది. సీడ‌బ్ల్యుసీ స‌మావేశంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తాజ్ కృష్ణ హోట‌ల్లో ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ స‌మావేశంలో స‌భ్యులు, ఆహ్వానితులు అంతా క‌లిపి 90 మంది వ‌ర‌కు పాల్గొంటారు. ఆదివారం జ‌రిగే విస్తృత స్థాయి సీడ‌బ్ల్యుసీ స‌మావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్య‌క్షులు, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రులు, ఇత‌ర రాష్ట్రాల్లోని సీఎల్‌పీ నేత‌లు, ఎంపీలు పాల్గొంటారు. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఈ స‌మావేశం పూర్తి చేసుకొని నాయ‌కులంతా తుక్కుగూడ‌లో జరిగే విజ‌య భేరి స‌భ‌కు త‌ర‌లి వెళ‌తారు.

తెలంగాణ భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైన రోజు సెప్టెంబ‌ర్17 గుర్తుగా నిర్వ‌హించే విజ‌య భేరిలో స‌భ‌ను 10 ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులంతా తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ స‌భ ద్వారా రాష్ట్రంలో ఒక సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల‌న్న ల‌క్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఉన్న‌ది.

అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల్లో ఆరు గ్యారెంటీల అమ‌లు

విధాత‌, హైద‌రాబాద్‌: విజ‌య భేరీ స‌భ‌లో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టిస్తార‌ని పీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జైరాం రమేష్, సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌తో క‌లిసి తుక్కుగూడ స‌భ ప్రాంగ‌ణాన్ని ప‌రిశీలించిన సంద‌ర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్ర‌క‌టించారు.

ఆనాడు సోనియ‌మ్మ‌ కరీంనగర్ సభలో చెప్పిన‌ట్లుగా తెలంగాణ ఇచ్చి మాట నిల‌బెట్టుకున్నార‌ని, అదే తరహాలో విజయభేరిలో ప్రకటించే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తారన్నారు. బీఆరెస్‌, బీజేపీలు కుటిల రాజకీయాలతో కాంగ్రెస్ సభను జరగకుండా చేయాలనుకున్నారన్నారు.

కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభ కోసం రైతులు ముందుకొచ్చి స్థలాన్ని ఇచ్చారన్నారు. రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీ గారికి స్వాగతం పలుకుదామ‌ని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాన్నారు.

అధికార మ‌ధం త‌ల‌కెక్కి

సోనియా గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితమ‌ని రేవంత్ అన్నారు. అధికార మదం తలకెక్కి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్, కేటీఆర్ కు సరైన సమాధానం చెబుతారన్నారు.

సోనియా ఇచ్చిన రాష్ట్రంలో దుర‌దృష్ట‌వ శాత్తు అవినీతి రాజ్య‌మేలుతుంది

సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దుర‌దృష్ట‌వ శాత్తు అవినీతి రాజ్య‌మేలుతుంద‌ని ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆరెస్ అన్నారు. బీజేపీ పాలనలో జాతీయత ఎక్కడుంది? అని ప్ర‌శ్నించారు. సీ

డబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామ‌న్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తామ‌న్నారు. నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎం లతో సహా 90 మంది ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు.

కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ సమావేశంతో తెలంగాణా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయన్నారు. శ‌నివారం ఉదయం 10.30కి ఎక్స్ టెండేడ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు విజయభేరి బహిరంగ సభ ఉంటుందన్నారు. విజయభేరి సభలో 6 గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేస్తారన్నారు. వచ్చే మూడు రోజులు పార్టీకి చాలా కీలకమైనవన్నారు.

ఆరాచ‌క పాల‌న సాగుతోంది

ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ అన్నారు.
భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదే త‌ర‌హాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామ‌న్నారు.

Exit mobile version