- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూకబ్జాదారులు
- కోట్ల రూపాయలకు పడగెత్తారు
- కెసిఆర్ పాలనలో అందరికీ అన్యాయం
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు
- టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శ
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాగా తయారయ్యారని ఎక్కడ భూమి ఉన్న కబ్జాకు పాల్పడుతూ చెలరేగిపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, దాస్యం వినయ భాస్కర్ బిల్లా, రంగాలుగా తయారయ్యారని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, సుదర్శన్ రెడ్డి, ఎంపీ దయాకర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరికి మించి ఒకరు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆఖరికి గుడి ముందు చెప్పులను కూడా వదిలిపెట్టకుండా తమ వశం చేసుకుంటున్నారని ఆరోపించారు. నాళాలు, చెరువు శిఖం, ప్రభుత్వ భూమి అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్యమ కాలంలో రబ్బర్ చెప్పులు లేని నాయకులంతా ఎమ్మెల్యేలుగా మారి ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మంత్రి ఎర్రబెల్లి ఏక్ నెంబర్ అయితే ఎంపీ దయాకర్ టైర్ల ఫ్యాక్టరీ భూమిని దక్కించుకొని దస్ నెంబర్ గా మారారని విమర్శించారు. ఇక ఈ దండు పాళ్యం ముఠా రోజులు లెక్క పెట్టుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి సోమవారం ప్రారంభమైన హాత్ సే హాత్ జోడోయాత్ర కలెక్టరేట్ బంగ్లా, కాళోజీ సెంటర్, ప్రెస్ క్లబ్, అంబేద్కర్ సెంటర్, పబ్లిక్ గార్డెన్, హనుమకొండ చౌరస్తా మీదుగా అమృత సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మిత్తితో సహా చెల్లించక తప్పదు
రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని తమ కార్యకర్తలను వేధించినోళ్లు మిత్తితో సహా చెల్లించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అధికారులు కూడా బానిసలుగా వ్యవహరించకుండా జాబుదారీతనంతో వ్యవహరించాలని విన్నవించారు. లేకుంటే వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు.
వరంగల్ సిటీలో ఒక్క బి ఆర్ ఎస్ నాయకులే కాకుండా బిజెపి నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు.
ఉప్పెనలా కప్పేందుకు సిద్ధమైతున్నారు
నివురుగప్పిన నిప్పులా ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈ ప్రభుత్వాన్ని ఉప్పెనలా కప్పేసేందుకు సిద్ధమవుతున్నారని రేవంత్ వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి నాభిగా నిలిస్తే కాకతీయ గలమెత్తి, గజ్జ కట్టి పోరుబాటగా నిలిచిందని కొనియాడారు. అందరూ కలిసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పాదయాత్రలో విద్యార్థులు తనను రైతులు, అడ్వకేట్లు కలిశారని చెప్పారు. జిల్లాలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలు నన్ను కలిశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు, అమరవీరుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నారని ఇప్పటికైనా ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. వారి ఆకాంక్షల అమలయ్యాయా? అంటూ ప్రశ్నించారు.
ఒక్క చంద్రశేఖర రావు కుటుంబం తప్ప ఎవరు బాగు పడలేదని 3వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, 80 వేల మంది రైతులు ఆత్మహత్య పాల్పడ్డారని వివరించారు. ప్రజా సమస్యల పట్ల కూడా నిర్లక్ష్యం చేశారని వివరించారు. జయశంకర్ పార్కు కెసిఆర్ సీసాలతో బొర్లుతుందని, కాళోజీ కళాక్షేత్రం అసంపూర్తిగా మిగిలిందని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కలగా మారాయని, జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరలేదని వివరించారు.
అన్ని పనులు పెండింగులో
అమరవీరుల స్తూపం పూర్తి చేయలేదని, అంబేద్కర్ విగ్రహం అలాగే ఉందని, కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్, సెక్రటేరియట్, ఫామ్ హౌస్ లో ఇల్లు బందోబస్తుగా నిర్మించుకున్నాడని విమర్శించారు. వేల కోట్లకు పడగలెత్తి టీవీ, పేపర్, సినిమాలు, ఆఖరికి సరసాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు కానీ, తన బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడని, తన బంధువు వినోద్ రావు ఎంపీగా ఓడిపోతే మరో పదవి ఇచ్చాడని, కోవర్ట్ ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇచ్చాడని మండిపడ్డారు. తెలంగాణలో ఎవరి కలలు నిజం కాలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి కాలేదని’ ఇంకెంతకాలం ఈ బాధ పడతామని కెసిఆర్ పాలనకు అంతం పలకాలని రేవంత్ పిలుపునిచ్చారు.
నేను కార్యకర్తల నాయకున్ని
నేను నాయకులకు నాయకున్ని కాదని.. కార్యకర్తలకు నాయకున్నని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోనియమ్మ బొమ్మ పెట్టుకొని గత 20 ఏళ్లుగా కేసులు, వేధింపులు భరిస్తూ నిబద్ధతతో పనిచేసిన రాజేందర్ రెడ్డి లాంటి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సోనియమ్మ చేస్తుందని నమ్మకం ఉందన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూస్తానని, జెండా మోసినోన్ని గుండెల్లో పెట్టుకుంటానని భరోసా ఇచ్చారు. నాయకులు కలిసి ఉండాలని కార్యకర్తలు కోరుకుంటూ కోరుకుంటున్నారని ఇప్పుడే హనుమంతన్న చెప్పాడని గుర్తు చేశారు.
జిల్లాలో ప్రజలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామనే ధీమా రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
ఈ కార్నర్ మీటింగ్ కు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు హనుమంతరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య తదితరులు ప్రసంగించారు. యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.