Karnataka | కన్నడ సీమపై విపక్ష పార్టీల ఐక్యతారాగం.. బీజేపీకి డేంజర్‌ బెల్స్‌

సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణానికి పెద్ద సంఖ్యలో హాజరైన విపక్ష నేతలు 2014 తర్వాత తొలిసారి ఒకే వేదికపై నేతలు రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలమే 2024 సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షం కాదు దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిపక్షం ఒకే వేదిక పంచుకున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తామంతా ఒక్కతాటి పై ఉండబోతున్నామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే వామపక్షాలు మొదలుకుని, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు హాజరై.. […]

  • Publish Date - May 20, 2023 / 01:17 PM IST
  • సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణానికి పెద్ద సంఖ్యలో హాజరైన విపక్ష నేతలు
  • 2014 తర్వాత తొలిసారి ఒకే వేదికపై నేతలు
  • రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు కాలమే
  • 2024 సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షం కాదు

దాదాపు పదేళ్ల తర్వాత ప్రతిపక్షం ఒకే వేదిక పంచుకున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తామంతా ఒక్కతాటి పై ఉండబోతున్నామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే వామపక్షాలు మొదలుకుని, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు హాజరై.. రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవటం లేదని ప్రకటన చేశాయి.

విధాత : కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు విపక్షాల ఐక్యతకు కూడా బాటలు వేశాయి. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొవడానికి కేసీఆర్, కేజ్రీవాల్, మమతాబెనర్జీ వంటి ప్రాంతీయపార్టీల అధినేతలు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదని స్టాలిన్, శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ఠాక్రే వంటి నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలువాలని ప్రజలే కాదు ఈ ప్రాంతీయ నేతలు కూడా బలంగా కోరుకున్నారు. అందుకే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానం మేరకు విపక్ష నేతలంతా హాజరయ్యారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపై రావడం ఇదే మొదటిసారి.

రాబోయే ఎన్నికలు ఏకపక్షం కాదు!

సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి సీఎంలు, మాజీ సీఎంలు, విపక్ష నేతలంతా హాజరుకావడం 2024 సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షం కాదు అనడానికి సంకేతంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్ ప్రదేశ్‌, బీహార్‌ సీఎంలు ఎంకే స్టాలిన్, అశోక్ గెహ్లాట్, హేమంత్ సొరేన్‌, భూపేశ్‌ బఘేల్‌, సుఖ్వీందర్‌సింగ్‌, నితీష్ కుమార్, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు హాజరయ్యారు.

కలిసికట్టుగా పనిచేస్తే…

కర్ణాటక, అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల నాయకులు తమ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయడమే. ఫలితంగా.. బీజేపీ ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా, మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టినా వారి యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని పిలుపునిచ్చిన బీజేపీకి కర్ణాటక ఫలితాలు పెద్ద షాక్‌నే ఇచ్చాయి. కేంద్రంలో తమకు తిరుగులేదని అనుకుంటున్న మోడీ-షాలకు ఈ ఫలితాలు మింగుడు పడేవి కాదు. వివిధ రాష్ట్రాల్లో మోడీ, షాల దూకుడుకు కళ్లెం వేసిన ప్రాంతీయ పార్టీల అధినేతలు.. తామంతా కాంగ్రెస్‌ వెంటే ఉంటామని ఇవాళ ప్రమాణ స్వీకారం సందర్భంగా గట్టి సందేశాన్ని పంపారు.

వీళ్లంతా కలిసి పోటీ చేస్తే..

ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రెండు చోట్ల అధికారంలో ఉన్నది. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నది. అక్కడ కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్టు ముఖాముఖి పోరు ఉంటుంది. మహారాష్ట్ర, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి క్యాడర్‌ ఉన్నది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తిరిగి అధికారం నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు.

ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలు కలిస్తే కర్ణాటక వలె ఘోర ఫలితాలను బీజేపీ చవిచూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. తమిళనాడు, బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో 200పైగానే లోక్‌సభ స్థానాలున్నాయి. కర్ణాటక వేదికగా ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలన్నీ 2024 ఎన్నికల్లో అవగాహనకు వచ్చి కలిసి పోటీ చేస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదంటున్నారు