కష్టపడ్డ ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటా: దాస్యం వినయ్ భాస్కర్

కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు

  • Publish Date - December 8, 2023 / 12:22 PM IST
  • పదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేశా
  • హనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దా
  • ప్రజా తీర్పును గౌరవిస్తా.. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు
  • హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఈ పదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేశానని, హనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ, గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఉద్యమకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించానన్నారు. స్వరాష్ట్రం కోసం రాజీనామా చేసి గెలుపొందానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం 2014, 2018లో అనేక పెండింగ్ పనులను పూర్తి చేశానన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశానని చెప్పారు. ప్రతిపక్షం, అధికారపక్షంలో ఉన్నప్పుడు నాయకులను గౌరవిస్తూ పనులు చేయించినట్లు చెప్పారు.


గుడిసె వాసుల కోసం వామపక్షాలతో కలిసి పోరాడానని తెలిపారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తూనే, నగరాభివృద్ధికి నిబద్ధతతో పనిచేశానన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్క, పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


దశాబ్దకాలంలో విశేష అభివృద్ధి


పదేళ్ల బీఆరెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల నుండి అనేక నిధులను తీసుకొచ్చానని వినయ్ అన్నారు. మున్సిపల్, టూరిజం, ఆర్ అండ్ బీ, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, రెవెన్యూ.. ఇలా చాలా రకాలుగా కొన్ని వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేశానన్నారు. 2005లో టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. కార్పొరేటర్ గా, నగర అధ్యక్షుడిగా పని చేశానని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడానని తెలిపారు.


2009 తెలంగాణ ఉద్యమ సమయంలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు. ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణను సాధించడమే ధ్యేయంగా ఆహర్నిశలు కృషి చేసానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, ముఖ్య నాయకులు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేవంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుందర్ రాజు యాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్ గౌడ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.