విధాత: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులా. అయితే ఈ ఎస్ఎంఎస్, మెసేజ్‌లు మీకూ వస్తున్నాయా. జాగ్రత్త.. ఏదో జరుగబోతోందని కంగారు పడితే నష్టం తప్పదు మరి. మీ యోనో ఖాతా బ్లాక్ చేయబడిందంటూ మోసగాళ్లు నకిలీ ఎస్ఎంఎస్, మెసేజ్‌లు మీ ఫోన్లకు పంపుతున్నారు.
ఎస్బీఐ అధికారుల పేరుతో కస్టమర్ల ఫోన్లకు ఈ సందేశాలు వస్తున్నాయి. అయితే వీటికి స్పందించవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా ఎస్బీఐ కోరుతున్నది. డియర్ ఎస్బీఐ యూజర్, యువర్ యోనో అకౌంట్ విల్‌బీ బ్లాక్డ్ టుడే. ప్లీజ్ క్లిక్ ఆన్ ది లింక్ టు అప్‌డేట్ యువర్ పాన్ కార్డ్ నంబర్ అని మేసేజ్‌లు వస్తున్నాయి.
నకిలీ మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి.#Cybercrime_Awareness #Dial_1930 #T4C. pic.twitter.com/vh0qv3rEZR
— Telangana Cyber Crime Coordination Centre (@Telangana4C) February 28, 2023
అయితే ఆ లింక్ (LINK)పై క్లిక్ చేసి మీ పాన్ కార్డు నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని చూస్తే మీ వ్యక్తిగత సమాచారంతోపాటు ఖాతాలోని సొమ్మునూ నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఎస్బీఐ హెచ్చరిస్తున్నది. కాబట్టి ఈ తరహా సందేశాలకు ఎప్పుడూ స్పందించవద్దని అంటున్నది.
ఇటువంటి ఎస్ఎంఎస్, మెసేజ్‌లు వస్తే వెంటనే report.phising@sbi.co.in కు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని, లేదా సైబర్ క్రైం (CYBER CRIME) హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయవచ్చని ఎస్బీఐ సూచిస్తున్నది. మరిన్ని వివరాల కోసం సైబర్ క్రైం ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ (WEBSITE)ను కూడా సందర్శించవచ్చు.
కాగా, ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా నంబర్ (ACCOUNT NUMBER), పిన్ నంబర్ (PIN NUMBER), పాన్ కార్డు నెంబర్ (PAN), ఆధార్ నంబర్ (AADHAAR NUMBER), ఓటీపీ (OTP) తదితర వివరాలను ఎస్బీఐ సిబ్బంది ఎప్పుడూ కోరబోరని బ్యాంక్ (BANK) ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అనుమానిత మెసేజ్ (MESSAGE)లను నమ్మి ఎవరితోనూ ఎటువంటి సమాచారాన్ని పంచుకోవద్దని, పంపించవద్దని విజ్ఞప్తి చేసింది.