విధాత, నల్గొండ: కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్‌లకు వ్యతిరేకంగా ఓటు వేసి ఓడిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మునుగోడు మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమన్వయ సమావేశం మాట్లాడుతూ మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అనిఅన్నారు.
కాంగ్రెస్ పార్టీ మునుగోడులో బలంగా ఉందని, ఇక్కడ కాంగ్రెస్ భావ జాలం పార్టీ గెలుపుకు ఉపయోగ పడుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి దోహదం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికలు దిక్సూచిగా మారాయని ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా చైతన్యంతో ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేసి కృష్ణానది నీళ్లను పొలాల్లోకి పారించే వాళ్ళమన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయకుండా మునుగోడు ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డు పడిందన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నత్తనడక సాగుతుందన్నారు.
నిర్వాసితులకు సరైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను దోచుకుందన్నారు. భగీరథ, కాకతీయ పథకాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు. ప్రతి పౌరుడిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి అప్పుగా 2.25లక్షలు భారం మోపారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెరుగుదలతో దేశ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.
దేశ సంపదను కార్పొరేటర్ ప్రైవేట్ వదోపిడి దారులకు విక్రయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గాలంటే బీజేపీని ఓడించాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మీడియాను ప్రజలను భయపెట్టి ప్రలోభ పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నా బిజెపి , టిఆర్ఎస్ లను ప్రజలు ఓటు అస్త్రంతో తిప్పి కొట్టాలన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్సీలు ప్రేమ్ సాగర్ రావు, పోట్ల నాగేశ్వరరావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నెమిండ్ల శ్రీనివాస్, సత్యనారాయణ రావు, రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.