Yamuna | గత మూడు రోజులుగా ఢిల్లీ, హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో యమునా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా 206.24 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ఈ విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారికంగా వెల్లడించింది.
డేంజర్ మార్కులో యమునా నది ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రైల్వే బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలని నార్తర్న్ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ వెల్లడించారు. 1978లో యమునా నది 207.49 మీటర్ల వద్ద ప్రవహించింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హర్యానా హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నది. 1,05,453 క్యూసెక్కుల నీరు యమునా నదిలో కలుస్తున్నది.
ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని మయూర్ విహార్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో నది ఒడ్డున నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.