Site icon vidhaatha

Supreme Court | ఉరి శిక్షపై చర్చించండి.. మరణ శిక్ష ఎలా ఉండాలి?: సుప్రీంకోర్టు

Hanging by Neck । దేశంలో మరణ శిక్ష ఎలా ఉండాలన్న అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. మరణశిక్షకు గురైన ఖైదీలను ప్రస్తుతం మెడకు ఉరి బిగించి, చనిపోయే వరకు వేలాడ దీస్తున్నారు. ఇది అత్యంత కిరాతకమైన శిక్ష అనే అభిప్రాయాలు ఉన్నాయి. కిరాతకాలకు పాల్పడినవారికి ఇంతకు మించిన పద్ధతిలో అమలు చేసే శిక్ష ఏముంటదని వాదించేవారూ ఉన్నారు. తాజా చర్చకు సుప్రీం కోర్టు దిశానిర్దేశం చేసింది.

విధాత: మరణ శిక్షకు గురైన ఖైదీకి గొంతుకు ఉరితాడు (hanging by neck) బిగించి వేలాడదీయడం కాకుండా తక్కువ నొప్పితో మరణ శిక్ష అమలు చేసేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం (The Supreme Court) కేంద్ర ప్రభుతాన్ని కోరింది. ఈ విషయంలో చర్చ ప్రారంభించాలని, తక్కువ నొప్పితో మరణశిక్షను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలకు సంబంధించిన సమాచారం సేకరించాలని సూచించింది.

ఈ విషయంలో శాస్త్ర, సాంకేతిక కోణంలో సలహాలు తీసుకునేందుకు దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాలు (National Law Universities), ఎయిమ్స్‌ (AIMS) వంటి హాస్పిట‌ళ్లు తదితర రంగాల నుంచి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కోర్టు తెలిపింది.

ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంగా వేరే మానవీయ పద్ధతులు అవలంబించేందుకు ఏవైనా అధ్యయనాలు జరిగి ఉంటే నిర్ధారించుకునేందుకు వీలుగా మే నెల వరకు అటార్నీ జనరల్‌ (Attorney General of India) ఆర్‌ వెంకటరమణికి ధర్మాసనం సమయం ఇచ్చింది. ఈ బెంచ్‌లో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఉన్నారు.

దీనిని పరిశీలించేందుకు రెండు మార్గాలు ఉన్నాయన్న ధర్మాసనం మానవత్వంతో కూడిన ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? లేక ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్నే కొనసాగించడమా? అనేది పరిశీలించాలని మౌఖికంగా కోరింది. మారుతున్న సాంకేతికత, లేదా ఈ విషయంలో మరోసారి పరిశీలన చేసేందుకు ఉన్న అవకాశాలు దీనికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నది. ఉరి శిక్షనే కొనసాగించాలనుకుంటే అందుకు తగిన అంతర్లీన వివరాలు కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి సూచించింది.

Exit mobile version