అమరావతి: చిత్తూరు నగర మాజీ మేయర్ కఠారి అనురాధ, మోహన్(Kattari Anuradha, Mohan) దంపతుల హత్యకేసు(Chittoor Mayor Couple Murder Case)లో నిందితులు ఐదుగురికి చిత్తూరు ఆరో అదనపు కోర్టు(Chittoor court) మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది(sensational verdict). 2015 నవంబర్ 17న జరిగిన మేయర్ అనురాధ, మోహన్ దంపతుల హత్యకు గురయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారి హత్య జరుగడం సంచలనం రేకెత్తించింది. ఈ కేసును 10ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఈ తీర్పు వెల్లడించారు. మరణశిక్ష విధించబడిన ఐదుగురు నిందితులు మేయర్ భర్త మోహన్ మేనల్లుడైన ఏ1 చంద్ర శేఖర్ @ చింటూ, ఏ2 వెంకట చలపతి @ ములబాగల్ వెంకటేశ్, ఏ3 జయప్రకాష్ రెడ్డి, ఏ4 మంజునాథ్, ఏ5 వెంకటేశ్ @ గంగన్నపల్లి వెంకటేశ్ లు ప్రస్తుతం చిత్తూర్ జైలులో ఉన్నారు. ఏ3, ఏ4గా ఉన్న జయప్రకాష్‌రెడ్డి, మంజునాథ్ లు అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే ఉండటం గమనార్హం.
ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్(ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉండగా..వారిలో కోర్టు ఐదుగురిని నిందితులుగా తేల్చి మరణ శిక్ష ఖరారు చేసింది.
ఆరోజు ఏం జరిగిందంటే..
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహన్‌కు ఏ1 నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహన్‌ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబరు 17న చింటూ, మరో నలుగురు అనుచరులతో కలిసి బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కఠారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే నేలకొరిగారు. పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు.
మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడినీ చంపేందుకు మంజునాథ్(ఏ4) యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులోనూ నేరం రుజువైంది. హంతకులకు సహకరించారంటూ మరో 16మందిపై పోలీసులు అభియోగాలు మోపినప్పటికి విచారణలో రుజువు కానందునా..వారిని కోర్టు నిర్దోషులుగా వదిలేసింది. పదేళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. చివరకు న్యాయస్థానం ప్రధాన నిందితులు ఐదుగురిని దోషులుగా తేల్చి మరణశిక్ష ఖరారు చేసింది.
