విధాత: నిన్న మునుగోడులో రాళ్ల దాడిలో గాయపడిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు బుధవారం పరామర్శించారు.
అనంతరం మీడియాతో కేటీఆర్ గారు మాట్లాడుతూ హింసకే పాల్పడుతామనే సిద్ధాంతం మీది ఏదైతో ఉందో.. దాన్ని తిప్పికొట్టే శక్తి, సత్తా మాకు ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.. కానీ మధ్యలో నలిగి పోయేది సామాన్యులని, భౌతికదాడులు సరికాదని అన్నారు. హింస దేనికి పరిష్కారం కాదని, చిల్లర పనులు, మాటలు, ప్రచారాలు బంద్ చేయాలని, మీ చిల్లర మాటలతో తెలంగాణలో అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తే.. బుద్ధి చెప్పే సత్తా కచ్చితంగా ప్రజలకు కూడా ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే అమిత్ షా మీటింగ్ రద్దు చేసుకున్నాడని, జేపీ నడ్డా కూడా రాలేదని, అందుకే మీరు దాడులకు పాల్పడుతున్నారన్నారు. బెంగాల్‌లో మీ వల్లే హింస ప్రారంభం అయిందని, శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్బాగ్య సంస్కృతి బీజేపీ పార్టీదని ఈ తరహ రాజకీయం బీజేపీకే సాధ్యమైతదని అన్నారు. నిన్న పలివెలలో 12 మంది టీఆర్ఎస్ నాయకులను గాయ పరిచారు. ఇదే సంస్కృతిని కొనసాగిస్తే మేం తిరగబడక తప్పదు, బుద్ది చెప్పక తప్పదని, సానుభూతి నాటకాలు మంచిది కాదు అని కేటీఆర్ హెచ్చరించారు.
గత 8 ఏండ్లలో ఉద్రిక్తతకు తావు ఇవ్వలేదు..
2001 నుంచి 2014 వరకు 14 ఏండ్ల పాటు ఎన్నో భావోద్వేగాల మధ్యన, ఎన్నో రకాల ఒత్తిళ్ల మధ్య తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలనే నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అన్ని రకాల అవరోధాలను తట్టుకున్నామన్నారు.
ధీరోదాత్తంగా ప్రజాస్వామ్య పద్దతుల్లోనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిందని..ఆ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 8 ఏండ్లలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ఉద్రిక్తతకు తావివ్వలేదని కేటీఆర్ తెలిపారు.
రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించం..
ఈ బీజేపీ నాయకులు వారి ఆగడాలు, ముఖ్యంగా ఇవాళ ఎన్నికల సమయంలో ఒక ప్రణాళిక ప్రకారం హింసను రెచ్చగొట్టాలి. శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలనే వ్యూహంతో దానికనుగుణంగానే నిన్న పలివెలలో పెద్ద ఎత్తున రాజేందర్ నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌తో పాటు 12 మంది కార్యకర్తల తలలు పగుల గొట్టారు. కర్రలతో దాడి చేశారు. మొత్తం ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఎవరు ఎవరి మీద దాడి చేశారనే ఆధారాలు ఉన్నాయన్నారు.
ఈటల రాజేందర్ పీఏ నరేశ్ రాళ్లతో దాడి చేసిన ఫోటోలు ఉన్నాయని, మా ప్రచారం మేం చేసుకుంటుంటే మాపై దాడి చేసి, సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారన్నారు. మీరు పిడికెడంత మంది ఉన్నారు. మాకు 60 లక్షల మంది కార్యకర్తులు ఉన్నారని అన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే.. సహించమని కేటీఆర్ తేల్చిచెప్పారు.