Gold Storage |
భారతీయులకు, బంగారానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. పండుగలకు, శుభకార్యాలకు పుత్తడిని భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో భారత్‌లో ఏటా 800 టన్నుల బంగారం డిమాండ్ ఉంటుంది. ఇందులో కేవలం టన్ను మాత్రమే భారత్‌లో ఉత్పత్తి అవుతుండగా.. మిగతాదంతా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. పొరుగుదేశం చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం భారత్ మాత్రమే.
అయితే, భారతీయ గృహాల్లో ఇప్పటి వరకు 25వేల టన్నులకుపైగా నిల్వ ఉన్నది. ఈ విషయాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలు పేర్కొంటున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో తులం రూ.89 ఉన్న బంగారం ఇప్పుడు ఏకంగా రూ.60వేల వరకు పలుకుతున్నది. అప్పటితో పోలిస్తే ధర ఇప్పటి వరకు 661 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి కిలో 107 పలుకగా.. ప్రస్తుతం 70వేలకుపైగా ట్రేడవుతున్నది.
ఇదిలా ఉండగా.. బంగారాన్ని సాధారణంగా పాదరసం లేదంటే వెండితో కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. కాలవరైట్, సిల్వనైట్, పెట్జైట్, క్రేనరైట్ ఖనిజాలుగా కూడా దొరుకుతుంది. ప్రస్తుతం చాలా వరకు బంగారాన్ని భూగర్భ గనుల నుంచి వెలికి తీస్తున్నారు.
వెలికి తీసిన బంగారాన్ని శుద్ధి చేసిన తర్వాత మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. అయితే, భూమి నుంచి ఇప్పటివరకు సుమారు 2లక్షల టన్నుల దాకా బంగారాన్ని వెలికి తీశారు. ఇంకా కేవలం 50వేల టన్నులు మాత్రమే భూగర్భంలో మిగిలి ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
ఏప్రిల్ 1, 2020 వరకు భూమిలో మొత్తం 5.86 టన్నుల బంగారం మిగిలి ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 2019 వరకు భారతీయుల ఇండ్లల్లో 25వేల టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలు తెలిపాయి.
ఇక 8వేల టన్నులకుపైగా అమెరికా ప్రభుత్వ ఖజానాలో నిల్వ చేసినట్లు ఫిస్కల్ సర్వీస్ ట్రెజరీ బ్యూరో విభాగం 2021లో పేర్కొంది. అమెరికా ప్రభుత్వ ఖజనాలో నిల్వ ఉన్న బంగారం కంటే.. భారతీయుల ఇండ్లల్లో దాదాపు మూడు రెట్ల బంగారం ఎక్కువగా నిల్వ ఉన్నది.