Murder | మద్యం సేవిస్తే చాలు.. పాతకాలం పురాణాలన్నీ గుర్తుకు వస్తుంటాయి. అంతేకాదు.. మనసులో ఉన్న విషయాలన్నింటినీ కక్కేస్తుంటాం. తాగిన మత్తులో నిజాలను కూడా చెప్పేస్తుంటాం. ఓ వ్యక్తి కూడా పీకల దాకా మద్యం సేవించి, 30 ఏండ్ల క్రితం తాను ఓ మర్డర్ చేశానంటూ నిజం చెప్పేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోనవాలాకు చెందిన అవినాష్ పవార్ తన 19 ఏండ్ల వయసులో మరో ఇద్దరితో కలిసి దంపతులను హత్య చేశాడు. అనంతరం ఆ దంపతుల ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలను దోచుకెళ్లారు. అయితే ముగ్గురిలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ హత్య కేసులో అవినాష్ పవార్ తప్పించుకున్నాడు.
అవినాష్ తన తల్లిని ముంబైలోనే వదిలేసి ఢిల్లీ పారిపోయాడు. ఢిల్లీలో కొంతకాలం గడిపిన తర్వాత ఔరంగాబాద్‌కు మకాం మార్చాడు. ఇక అమిత్ పవార్ అని పేరు మార్చుకున్న అవినాష్ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. వివాహం చేసుకున్నాడు. పింపిరి, చించ్వాడ్, అహ్మద్‌నగర్‌లో కొంతకాలం పాటు నివసించాడు. చివరకు ముంబైలోని విక్రోలి ఏరియాలో తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. భార్యను స్థానికంగా రాజకీయాల్లోకి దింపాడు అవినాష్.
అయితే ఇటీవలే అవినాష్.. స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో తన 19 ఏండ్ల వయసులో ముంబైలోని లోనావాలాలో దంపతులను హత్య చేశానని తెలిపాడు. అనంతరం ఢిల్లీ పారిపోయానని చెప్పాడు. తన తల్లి, అత్తమామలు కూడా లోనావాలాలోనే నివాసం ఉంటున్నట్లు తెలిపాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అవినాష్ పవార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.