విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుండి రానున్న ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చర్చలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తున్న దుబ్బాక నరసింహరెడ్డికి రానున్నఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా లేక మరోసారి ఇక్కడ నుండి మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారా.. అసలు వెంకటరెడ్డి ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో ఉంటారా లేక బీజేపీలోకి వెళ్తారా అనే విషయాలపై కాంగ్రెస్ కేడర్ లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో రచ్చబండ చర్చలు రగులుతున్నాయి.
ఈ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుసగా 5 ఎన్నికల్లో పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దివంగత వైఎస్ఆర్, కే. రోశయ్య, ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2018 ఎన్నికల్లో ఐదో సారి పోటీ చేసిన క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ వెంటనే కోమటిరెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి వెంకట్ రెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గానికి రాకపోకలు తగ్గించడంతో.. నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్‌ను దుబ్బాక నరసింహ రెడ్డి ముందుకు నడిపిస్తూ వారికి అందుబాటులో ఉంటు పార్టీని నడిపిస్తున్నారు. ఈ క్రమలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
దుబ్బాక నరసింహరెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగినప్పటికి.. ఆయనకు రాజకీయాల్లో పరిస్థితులు, అదృష్టం కలిసి రాకపోవడం, స్వీయ పొరపాట్లు ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కుడి భుజంగా ఇద్దరు మిత్రులు అన్నట్లుగా ఉండే దుబ్బాక అనూహ్యంగా వెంకటరెడ్డితో విభేదించి 2009 ఎన్నికలకు ముందు సినీ నటుడు చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
2009 శాసనసభ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ ఎన్నికల బరిలో వెంకట్ రెడ్డితో పాటు సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డితో దుబ్బాక నరసింహరెడ్డి పీఆర్పీ అభ్యర్థిగా త్రిముఖ పోటీలో తలపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంకట్ రెడ్డికి 60,665 ఓట్లు, నంద్యాల 52,288 ఓట్లు సాధించగా, దుబ్బాక 22,017 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన దుబ్బాక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మంచి గాలి ఉన్న సమయంలో రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60,774 ఓట్లు సాధించి నాలుగోసారి విజయం అందుకోగా, టీడీపీ రెబల్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డికి 50,227 ఓట్లు పడగా, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక 35,606 ఓట్లతో మరోసారి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఇక 2018 ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన దుబ్బాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కోసం శ్రమించిన తనను కాదని సీఎం కేసీఆర్ టీడీపీ వలసనేత కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో దుబ్బాక టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.
అప్పటిదాకా నియోజకవర్గంలో పదేళ్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సాగించిన ముఖాముఖి రాజకీయ యుద్ధాన్ని పక్కన పెట్టి పాత చెలిమిని గుర్తు చేసుకుంటూ అదే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి వెంకటరెడ్డి విజయం కోసం పని చేసినప్పటికీ కంచర్ల గెలుపును అడ్డుకోలేక పోయారు.
అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా వెంకటరెడ్డి విజయం కోసం దుబ్బాక తనవంతు కృషి చేశారు. ఎన్నికల అనంతరం కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్న దుబ్బాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మళ్లీ తన కార్యకలాపాలను ఉదృతం చేశారు. పీసీసీ పిలుపు మేరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ను ముందుండి నడిపిస్తున్నప్పటికీ విచిత్రంగా వెంకటరెడ్డితో కలిసి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం ఆ పార్టీ కేడర్‌ను కొంత అయోమయానికి గురిచేస్తుంది.
వెంకట్ రెడ్డి సంగతి తేలితేనే..
అయితే మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్న దుబ్బాక నరసింహ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కాలంటే ఆయన మిత్రుడు వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీకి దూరంగా ఉండా ల్సిందే. భువనగిరి ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగితే అప్పుడు దుబ్బాక రాజకీయ భవిష్యత్తుకు మరో సవాల్ ఎదురుకాక తప్పదు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళితే మాత్రం దుబ్బాకకు కాంగ్రెస్ నుంచి టికెట్ సాధనలో ఎదురు ఉండకపోవచ్చు.
బీజేపీ నుంచి వెంకటరెడ్డి ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగితే అప్పుడు కాంగ్రెస్ నుంచి దుబ్బాక కు టికెట్ దక్కినా.. ఎన్నికల్లో వెంక రెడ్డితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థితో త్రిముఖ పోటీలో తలపడక తప్పదు. అలా కాకుండా వెంకటరెడ్డితో పాటే దుబ్బాక బీజేపీలోకి వెళితే ఆయనకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇక్కడి నుంచి అవకాశం దక్కకపోవచ్చు. లేదా వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగి ఇదే నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగితే దుబ్బాక బీజేపీ వైపు చూడక తప్పదు.
ఎటు నుంచి ఎటు చూసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల నాటికి తీసుకునే రాజకీయ నిర్ణయం పైనే నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి దుబ్బాక ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ముడిపడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నిలవాలన్న సంకల్పంతో ఉన్న దుబ్బాక నల్గొండలో కాంగ్రెస్ నుంచి తన రాజకీయ కార్యకలాపాలకు పదును పెడుతూ మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధం అవుతున్నారు.
మరోవైపు తన సొంత నియోజకవర్గంలో మిత్రుడు దుబ్బాక కాంగ్రెస్ నుంచి సాగిస్తున్న రాజకీయాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా మాత్రం ఎలాంటి స్పందనలు వ్యక్త పరచకపోవడం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు.