Site icon vidhaatha

ఇక సమరమే.. సార్వత్రిక ఎన్నిలకు షెడ్యూల్ విడుదల


తెలుగు రాష్ట్రాలకు షెడ్యూల్ ఇదే


విధాత: ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ స‌భ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సార్వత్రిక ఎన్నికలతోపాటే నాలుగు రాష్ట్రాలు.. సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకు కూడా ఎన్నికలు నిర్వహించనుట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.


షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనుండగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ పోలింగ్‌ జూన్ 1న నిర్వహించనున్నారు.


ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. వాటిలో తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం కూడా ఉంది. మొదటి దశలోనే అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఏపీకి, తెలంగాణకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తుండటం విశేషం.


ఈ ఎన్నికల్లో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు, ట్రాన్స్జెండర్లు 48,000 ఉన్నారు. దివ్యాంగులు 88.4 కోట్లు, సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు, 85 ఏళ్లు పైబడినవారు 82 లక్షలు, యువ ఓటర్లు (20 నుంచి 29 ఏళ్లు) 19.74 కోట్లు ఉన్నారు. ఇక శతాధిక వయస్కులు 2.18 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 1.8 కోట్ల మంది తొలిసారి ఓటేయబోతున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. వాటిలో 55 లక్షల ఈవీఎంలు ఓటింగ్ కోసం ఉపయోగిస్తారు. పోలింగ్, ఎన్నికల భద్రత విధుల్లో సుమారు కోటిన్నర మంది పాల్గొనబోతున్నారు.


ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్


తొలి దశలో ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60అసెంబ్లీ స్థానాలకు, సిక్కిం అసెంబ్లీలోని 32 స్థానాలకు కూడా తొలి దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. 27వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, తిరస్కరణ, 30న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. అయితే బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, ఏప్రిల్‌2న ఉపసంహరణ ఉండనుంది.


రెండో దశలో ఏప్రిల్ 26న 13రాష్ట్రాల్లోని 89 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో మే 7న 12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. నాల్గవ దశలో మే 13న తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగునున్నాయి. ఏపీలోని 25 లోక్సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇదే రోజు ఎన్నికలు ఉంటాయి.


సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా నాలుగో విడుతలోనే ఉంటుంది. నాలుగో విడుతకు మార్చి 18న నోటిఫికేషన్, 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువు ఉంటుంది. ఐదో దశలో మే 20న 8 రాష్ట్రాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో దశలో మే 25న 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడో దశలో జూన్ 1న 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.


మొత్తం ఓటర్లు : 96.8 కోట్లు

పురుషులు : 49.7 కోట్లు

మహిళలు : 47.1 కోట్లు

ట్రాన్స్జెండర్లు : 48,000

తొలిసారి ఓటేయనున్నది : 1.8 కోట్లు

దివ్యాంగులు : 88.4 కోట్లు

సర్వీస్ ఓటర్లు : 19.1 లక్షలు

85 ఏళ్లు పైబడినవారు : 82 లక్షలు

యువ ఓటర్లు (20 నుంచి 29 ఏళ్లు) 19.74 కోట్లు

శతాధిక వయస్కులు : 2.18 కోట్లు

మొత్తం పోలింగ్ స్టేషన్లు : 10.5 లక్షలు

ఈవీఎంలు : 55 లక్షలు

పోలింగ్, భద్రతా సిబ్బంది : 1.5 కోట్లు


మణిపూర్ నియోజకవర్గానికి రెండు సార్లు పోలింగ్


దేశంలో 543 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. సీఈసీ విడుదల చేసిన జాబితాలో 544 చూపిస్తున్నది. ఇదే అంశంపై మీడియా ప్రశ్నించగా.. జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్లో ఒకే నియోజకవర్గానికి రెండుసార్లు పోలింగ్ నిర్వహించనున్నట్టు వివరణ ఇచ్చారు.

Exit mobile version