విధాత: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఆ మార్గంలో రూ. 50 వేలకు మించి నగదుతో ప్రయాణిస్తే తప్పనిసరిగా ఆధారాలు చూపించాల్సిందే. లేని పక్షంలో పోలీసులు ఆ నగదును సీజ్ చేస్తారు.
లెక్కా పత్రం లేకపోతే మాత్రం ఆ నగదును సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం స్థానిక ట్రెజరీలో డిపాజిట్ చేస్తారు. సరైన ఆధారాలు తీసుకుని వస్తేనే ఆర్వో ఆదేశాల మేరకు డబ్బును తిరిగి ఇస్తారని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి పార్థసింహారెడ్డి తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జాతీయ రహదారితో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తుప్రాన్‌పేట, పంతంగి టోల్ గేట్ వద్ద రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేయకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు.