Site icon vidhaatha

High Court | ఖాదీర్ ఖాన్ లాకప్ డెత్‌పై.. కౌంటర్‌ దాఖలు చేయండి: ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు

High Court |

విధాత‌, హైద‌రాబాద్: మెదక్‌లో జరిగిన ఖాదీర్ ఖాన్ లాకప్ డెత్ ఘటనపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, మెదక్‌ ఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్‌ ఖాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరిలో మృతి చెందాడు.

దొంగతనం కేసులో అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఖాదీర్‌ మృతి అంశంపై రాజ్యాంగబద్ధ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో విచారణ జరిపించాలని, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ అతని భార్య సిద్ధేశ్వరి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని, సీసీటీవీ ఫుటేజీ ఫ్రీజ్‌ చేసేలా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

గతంలో ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. దీన్ని ప్రస్తావిస్తూ.. పిల్‌తో పాటే రిట్‌ను కూడా విచారణ చేపడుతామన్న ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version