నిలోఫ‌ర్‌లో తొలి కరోనా కేసు న‌మోదు..

  • Publish Date - December 22, 2023 / 03:15 AM IST

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో తొలి క‌రోనా కేసు న‌మోదైంది. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర‌మైన జ్వ‌రం, ఊపిరి పీల్చుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డ ఓ 14 నెల‌ల చిన్నారిని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో వైద్యులు ఆ పాప‌కు వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు.


అనుమానం వ‌చ్చి కొవిడ్ టెస్టులు చేయ‌గా, క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆ చిన్నారి నిలోఫ‌ర్ ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతోంది. క‌రోనా నుంచి పాప రిక‌వ‌రీ అయింద‌ని, వెంటిలేట‌ర్‌ను తొల‌గిచి, ప్ర‌స్తుతం ఆక్సిజ‌న్ సాయంతో చికిత్స అందిస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వైద్యాధికారి ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ క‌ల్యాణి తెలిపారు. బాధిత చిన్నారి నాంప‌ల్లి ఆగాపురాకు చెందిన పాప‌గా పేర్కొన్నారు.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా ఆరు క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. హైద‌రాబాద్‌లో నాలుగు, మెద‌క్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున న‌మోదు అయ్యాయి. ప్ర‌స్తుతం 20 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో ఒక‌రు రిక‌వ‌రీ అయ్యారు. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉంది.

10 ఏండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబ‌డ్డ వారు అన‌వ‌స‌రంగా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌స్తే మాస్కు ధ‌రించాల‌ని కోరారు. జ్వ‌రం, ఒళ్లు నొప్పు, ద‌గ్గు, జ‌లుబు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఏర్ప‌డితే త‌క్ష‌ణ‌మే క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు.