విధాత: మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అభర్థిగా ప్రజాయుద్ద నౌక గద్దర్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా కేఏ పాల్ అమరణ దీక్షకు దిగిన విషయం విదితమే.
అక్టోబర్ 2న తాము నిర్వహించ తలపెట్టిన ప్రపంచ శాంతి ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాల్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. అయితే బుధవారం కేఏ పాల్ ను కలిసిన గద్దర్.. ఆయనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు.
ఈ సందర్భంగా గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున మునుగోడు బై ఎలక్షన్స్ బరిలో నిలవనున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానన్నారు.
“భారత రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం నోటు తీసుకోని ఓటు వేయడం నేరం. అందరికి అదే చెబుతున్నా నోటు తీసుకోకుండా మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఇదే నినాదంతో ఎన్నికల ప్రచారంలోనికి వెళ్తా. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న మిత్రుడు కేఏ పాల్‌తో కలిసి పని చేయాలనేది నా ఉద్దేశం. అందుకే నా మద్దతు పాల్‌కు ఉంటుందని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు.