Site icon vidhaatha

Goods Train Accident | ఒకే ట్రాక్‌పైకి వచ్చి ఢీకొట్టుకున్న గూడ్స్‌ రైళ్లు.. ఆందోళనకు గురి చేస్తున్న ప్రమాదాలు..!

Goods Train Accident | ఒడిశా బహనగ రైలు ప్రమాదాన్ని మరిచిపోక ముందే పశ్చిమ బెంగాల్‌లో మరో ఘటన చోటు చేసుకున్నది. ఓండా రైల్వేస్టేషన్‌ సమీపంలో రెండు గూడ్స్‌ రైళ్లు ఆదివారం ఉదయం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో రెండు ఇంజిన్లతో పాటు ఎనిమిది రేకులు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ప్రమాదం నేపథ్యంలో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా మార్గంలో 14 రైళ్లను రద్దు చేశారు. పలు రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదంలో లోకో పైలట్‌ గాయపడ్డాడు.

ఎవరికీ ప్రాణాపాయం తప్పలేదు. అయితే, రైల్వేకు మాత్రం భారీగా నష్టం వాటిల్లగా.. ఎంత మేరకు జరిగిందనే తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌ బంకురా జిల్లాలోని ఓండా రైల్వేస్టేషన్లలో ఆదివారం వేకువ జామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు గూడ్స్‌ రైళ్లు వెళ్తున్నాయి. దీంతో సిబ్బంది ఓ రైలును లూప్‌లైన్‌లో నిలిపివేశారు.

అయినప్పటికీ ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు.. ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్‌పైకి వేగంగా దూసుకువచ్చింది. ప్రమాదం తర్వాత స్పందించిన రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రైల్వేశాఖలో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒడిశా బహనగ రైల్వేస్టేషన్‌ వద్ద మూడు రైళ్లు ఢీకొట్టుకోగా.. 280 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికిపైగా గాయపడ్డారు. బహనగ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద నిలిచింది.

Exit mobile version