Petrol prices | పెట్రో పన్నుపై కోత! ఎన్నికల వేళ మోదీ సర్కార్‌ ఆలోచన!

ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు చర్యలు పలు దిగుమతులపై సుంకాల తగ్గింపు Petrol prices | న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, మంటలెక్కిస్తున్న పెట్రోల్‌ ధరల నేపథ్యంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పెట్రో పన్ను తగ్గింపు, వంటనూనెలు, గోధుమల దిగుమతి సుంకాలపై కోత వంటి నిర్ణయాలను ప్రధాని నరేంద్రమోదీ రానున్న వారాల్లో తీసుకునే అవకాశం ఉన్నదని ఆ […]

  • Publish Date - August 17, 2023 / 12:17 PM IST

  • ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు చర్యలు
  • పలు దిగుమతులపై సుంకాల తగ్గింపు

Petrol prices |

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, మంటలెక్కిస్తున్న పెట్రోల్‌ ధరల నేపథ్యంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పెట్రో పన్ను తగ్గింపు, వంటనూనెలు, గోధుమల దిగుమతి సుంకాలపై కోత వంటి నిర్ణయాలను ప్రధాని నరేంద్రమోదీ రానున్న వారాల్లో తీసుకునే అవకాశం ఉన్నదని ఆ వర్గాలు తెలిపాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు యుద్ధం చేస్తానని మోదీ ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో చెప్పిన నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారవర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఉల్లి ధర పెరిగినందుకు ప్రభుత్వాల పతనం

ఉల్లిపాయాలు, టమాటాల ధరల పెరుగుదల అంశంపై ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర భారతదేశానికి ఉన్నది. సరిగ్గా కొద్దిరోజులుగా టమాటా ధరలు అనూహ్యంగా పెరిగి.. సాధారణ, మధ్యతరగతి వర్గాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. పైపెచ్చు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో బీజేపీ నేతల్లో కలవరం నెలకొన్నది.

అదే సమయంలో బడ్జెట్‌ లోటు ఏర్పడకుండా చూసుకోవాలి. దీనికోసం వివిధ శాఖల బడ్జెట్‌ల నుంచి దాదాపు లక్ష కోట్లను ఇతర మార్గాల్లోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. తద్వారా పేదలకు తక్కువ వడ్డీలకే రుణాలు, ఇళ్లు ఇవ్వడం వంటి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు.

అయితే.. ఆర్థిక శాఖ అధికార ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. ధరలు తగ్గించేందుకు గాను.. ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వచేసేవారిపై దాడులు కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల భారీ వర్షాలు, వాటి కారణంగా వరదలతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.

వీటిలో ఇళ్లలో ప్రతినిత్యం వాడుకునే టమాటా, ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి. 2022లో గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపైనా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఎన్నికల సంవత్సరం ధరలు పెరుగుతూనే ఉంటే సర్కారుకు కష్టకాలమేనని భావించిన ప్రభుత్వ పెద్దలు ఆఖరి నిమిషంలో ప్రయత్నాలు దిగుతున్నారు.

Latest News