విధాత, నిజామాబాద్: వేటకు వెళ్లిన వ్యక్తి నాటు తుపాకీ పేలి మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల సరిహద్దుల్లో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా సోమార్ పేట్ గ్రామ పరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ రావుజీ (36) తుపాకీ పేలి మృతి చెందగా బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న మాచారెడ్డి, సిరికొండ పోలీసులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా వీరు ముగ్గురు తరచూ వన్యప్రాణుల వేటకు వెళ్లే వారని గ్రామస్థులు తెలిపారు. వివరాలు ఇలా వున్నాయి.
మృతుడు బానోత్ రావుజీ చెరువు వద్దకు నీళ్లు తాగడానికి వచ్చే వన్య ప్రాణులను వేటాడేందుకు చెట్టుపైకి ఎక్కాడు. అతని అన్న బానోత్ రాంరెడ్డి లోడ్ చేసిన తుపాకీని చెట్టుపైన వున్న తమ్ముడు రావుజీకి అందించాడు.
తుపాకీని అందుకునే క్రమంలో అది జారీ నేలకు బలంగా తాకడం వల్ల తుపాకీ పేలి చెట్టు పైన ఉన్న రావుజీ శరీరం నుండి తూటా బయటకు వెళ్లింది. దీంతో రావుజీ మృతి చెందాడు. ఈ ఘటనతో రాంరెడ్డి, ఆశిరెడ్డి అక్కడి నుండి తప్పించుకున్నారు.
సమాచారం అందుకున్న సోమార్ పేట్ గ్రామస్తులు అదే రాత్రి అటవీ ప్రాంతానికి తరలివెళ్లారు. ఘటన జరిగిన స్థలం సిరికొండ అటవీ ప్రాంతం పరిధిలోకి వస్తుందని కేసును సిరికొండ పోలీసులకు అప్పగించినట్లు మాచారెడ్డి ఎస్ఐ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును నిజామాబాదు జిల్లా సిరికొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.