విధాత: ఎయిమ్స్ ఘటన మరచిపోక ముందే మరో సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు హాంకాంగ్ నుంచి ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధికార వెబ్‌సైట్‌పై దాడి చేశారు. నవంబర్ 30న 24గంటల వ్యవధిలోనే 6వేల సార్లు దాడికి ప్రయత్నించారు. కానీ ఐసీఎంఆర్ డాటాకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.
ఐసీఎంఆర్‌కు సంబంధించిన డాటా అంతా ఎన్‌ఐసీలో నిక్షిప్తమై ఉంటుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడుతుంది. కాబట్టి హ్యాకర్లు అనుకున్నది సాధించలేక పోయినట్లు తెలుస్తున్నది. అయితే హ్యాకర్లు పదే పదే వైద్య, ఆరోగ్య రంగంపైనే దాడికి పాల్పడటం వెనుక ఉన్న మతలబు ఏంటా అని ఆలోచిస్తున్నారు.
రెండో సారి కూడా వైద్య రంగ సంస్థనే ఎంచుకొని సైబర్ దాడి జరగటం గమనార్హం. ఇలాంటి దాడులే దేశంలో ఏ రంగంపై ఏ రూపంలో దాడి జరుగుతున్నదో ఊహించుకుంటేనే గుబులు పుడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలతో హ్యాకర్ దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన వ్యవస్థలన్నింటినీ శత్రుదుర్బేధ్యంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.