Telangana |
గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గాలితో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. రైతులు బోరుమంటున్నారు.
మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
రాష్ట్ర ప్రజలు అవసరమైతేనే తమ నివాసాల నుంచి బయటకు రావాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వృక్షాలు నేలకొరిగే ప్రమాదం ఉందని, చెట్ల కింద ఎవరూ ఉండకూడదని హెచ్చరించింది.