విధాత: జనసేన పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు, రచయిత, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్, జనసేనలకు మద్దతు ఇస్తోన్న ఈయన తాజాగా సినీ నటుడిగా కాదు జనసేన అభ్యర్థిగా ముందుకు వచ్చానని హైపర్ ఆది వ్యాఖ్యానించాడు.
ఈ సంగతులను పక్కన పెడితే జనసేన యువశక్తి పేరుతో జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో రణస్థలం లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. కామెడీ పంచులు వేయడంలో దిట్టైనా హైపర్ ఆది యువశక్తి వేదికగా పొలిటికల్ పంచ్ డైలాగులు పేల్చాడు.
మీకెందుకు అన్ని శాఖలు.. మొత్తం అన్నిటిని ఎత్తేయండి.. పవన్ కళ్యాణ్ ని తిట్టే ఒక శాఖ పెట్టుకోండి అంటూ వైసీపీకి హైపర్ ఆది పంచ్ వేశాడు. పవన్ ప్రజల ప్రేమలకు లొంగుతారేమోగానీ డబ్బులకి లొంగరు అంటూ ప్యాకేజీ విమర్శలపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు అన్నిచోట్ల చర్చనీయాంశం అవుతున్నాయి.
రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు అంటున్నారు… ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇంతలా జనానికి సేవ చేస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ గెలిస్తే కష్టం సామాన్యుల గడపను సైతం తాకనివ్వరు అంటూ హైపర్ ఆది ఉద్వేగంగా ప్రసంగించాడు. జనసేన పార్టీకి మొదటి నుంచి హైపర్ ఆది మద్దతు ఇస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కొంత పొలిటికల్ హీట్ ని కూడా ఎదుర్కొన్నాడు. అయినా పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానాన్ని మాత్రం ఎప్పుడూ చాటుకుంటూనే ఉన్నాడు.
కష్టపడితే ఎవరికైనా ప్రపంచంలో ఎంత గొప్ప పదవి అయినా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి ఆయనకు తప్ప ఇంకెవరికి దక్కదు అని చెబుతూ డబ్బు మీద ఆశ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్… జనసేన ను గెలిపిస్తే ప్రజాధనం ఒక్క పైసా కూడా వృథా కాకుండా చేస్తారు. రికార్డుల కోసం సంపాదన కోసం ఏ హీరో అయినా సినిమాలు చేస్తాడు.
రైతుల కష్టాలు తీర్చడానికి, వారి బాగు కోసం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినవారు బతుకు మీద భయంతో, జనసేన మీద నమ్మకంతో ఉన్నారు. వీరు బిర్యానీ, బీరు మీద ఆశతో వచ్చిన వాళ్ళు కాదు అని హైపర్ ఆది వ్యాఖ్యానించడం గమనార్హం.