Site icon vidhaatha

వారిని సీఎం సీట్లో నేనే కూర్చోబెడుతా: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy విధాత: ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నది. కానీ ఆ పార్టీ నేతల అనైక్యతను అధికార పార్టీ అనుకూలంగా మలుచుకున్నది. ఫలితంగా ఇవాళ నల్గొండ, పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోయాడు. పాలమూరులోని కొల్లాపూర్‌లో గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి, నకిరేకల్‌లో నెగ్గిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్‌లో చేరారు.

నల్గొండ జిల్లాలో గత ఎన్నికల్లో 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఉత్తమ్‌ ఎంపీగా కొనసాగుతూ హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ, మునుగోడు గెలిచిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచింది. ప్రస్తుతం ఈ రెండు జిల్లాలోని మొత్తం 26 సీట్లు బీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని మొత్తం సీట్లను గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని, సీఎం సీటును పార్టీ అధిష్ఠానం ఎవరికి కేటాయించినా వారిని సీఎం సీట్లో తానే కూర్చోబెడుతానని క్లియర్‌గా చెప్పారు.

అంటే అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం ఇచ్చినా స్వాగతిస్తానని చెప్పారు. అంతకంటే ముందు విభేదాలు వీడి ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యతను పార్టీ రాష్ట్ర బాధ్యుడిగా తన వైఖరిని స్పష్టం చేశారు. అప్పుడే అధికార పార్టీని ఓడించగలమనే సందేశాన్ని పంపారు.

అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఠాక్రే నిన్న హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర రేవంత్‌రెడ్డి 50 నియోజకవర్గాలకు తగ్గకుండా, సీనియర్లు 20-30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలని సూచించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాత్రను విజయవంతం చేయాలన్నారు.

70-80 నుంచి స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నదని, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున కొంచెం కష్టపడితే గెలువొచ్చని చెప్పకనే చెప్పారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి నేతలు పార్టీ వీడినా కార్యకర్తలు కాంగ్రెస్‌తోనే ఉన్నారనడానికి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన ఓట్లను బట్టి తెలుస్తోంది. కష్టపడే కార్యకర్తలకు, నేతలు భరోసా ఇచ్చి బాధ్యత తీసుకుంటే బీఆర్‌ఎస్‌ను నిలువరించడం కష్టమేమీ కాదని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

Exit mobile version