- సంచలనం రేపిన ఆకునూరి ట్వీట్
- స్మిత సబర్వాల్‌ను పంపొద్దని సూచన
- తాను ఎక్కడికీ వెళ్లటం లేదన్న సబర్వాల్
- ఇక్కడే ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని వెల్లడి
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత బీఆరెస్ సర్కారుతో అంటకాగిన బ్యూరోక్రాట్లను ఒక్కొక్కరిగా తప్పిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కీలక పదవుల్లో మార్పులు కనిపించాయి. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను సైతం తప్పిస్తారనే అభిప్రాయాలు వచ్చాయి. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్ సచివాలయానికి రాలేదు. ముఖ్యమంత్రికిగానీ, సంబంధిత శాఖ మంత్రికి గానీ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం అనే సంప్రదాయాన్ని కూడా పాటించలేదు.
దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళతారని, ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారని కూడా ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ‘అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్రం ప్రభుత్వ సర్వీసులలోకి వెళ్లి (అక్కడి క్యాస్ట్ కనెక్షన్స్ నెట్‌వర్క్ వాడుకుని), ఇక్కడి తప్పులను తప్పించుకోవడం ఫ్యాషన్ అయ్యింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపించకుండా చర్యలు తీసుకోవాలి.
ఏ తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవడం? దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా హెలికాప్టర్‌లో జిల్లాలకు వెళ్లి, అభివృద్ధి పనులను తనిఖీలు చేసే, పరిశీలించే ఏకైక ఐఏఎస్ అధికారి ఈమెగారు మాత్రమే’ అని ఎక్స్‌లో ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంవో ఖాతాలను ట్యాగ్ చేశారు. అయితే.. డిప్యూటేషన్‌పై తాను కేంద్ర సర్వీసులలోకి వెళుతున్న ప్రచారాన్ని స్మిత సబర్వాల్ ఖండించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన తాను ఐఏఎస్‌గా ఇక్కడే ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తానని ఎక్స్‌లో పేర్కొన్నారు.
గత బీఆరెస్ ప్రభుత్వ హయాలో సిఎం కార్యాలయంలో స్మితా సబర్వాల్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగా.. అక్కడ స్మితా సబర్వాల్ ప్రత్యక్ష కావడంతో పలువురు ఆశ్చర్యపోయారు.